‘మద్దతుధర నిర్ణయించే అవకాశం రాష్ట్రాలకే ఇవ్వాలి’

by Ramesh Goud |
‘మద్దతుధర నిర్ణయించే అవకాశం రాష్ట్రాలకే ఇవ్వాలి’
X

ఢిల్లీ: భౌగోళిక పరిస్థితులు, ఉత్పత్తి, వ్యయాల్లో మార్పులుండటంతో కనీస మద్దతుధర నిర్ణయించే అవకాశాన్ని రాష్ట్రాలకే ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. ఢిల్లీలో గురువారం జరిగిన 91వ కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ICAR) గవర్నింగ్ బాడీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ.. వ్యవసాయ, ఆహారావృద్ధి పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలన్నారు. జగిత్యాల జిల్లాలో ఆవాల పంటపై ప్రాజెక్టును ఏర్పాటు చేయలన్నారు. వరి విస్తీర్ణం, సాగునీటి వసతులు పెరిగిన నేపథ్యంలో ప్రతి నీటిబొట్టునూ సద్వినియోగం చేసుకునేందుకు నీటియాజమాన్యంపై ఏఐసీఆర్‌పీ కింద పరిశోధన కోసం ప్రాజెక్టును మంజూరు చేయాలని కోరారు. రైతులను మార్కెట్లతో అనుసంధానం చేసేందుకు రైతు ఉత్పత్తిదారుల వ్యవస్థ (FPO) ద్వారా ఈ-నామ్‌పై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. తెలంగాణలో కొత్త జిల్లాల ప్రాతిపదికన మరిన్ని కృషి విజ్ఞాన్ కేంద్రాలు ఏర్పాటుచేయాలని కోరారు. అదనంగా 50వేల మెట్రిక్ టన్నుల కందుల కొనుగోలుకు అనుమతినివ్వాలని కోరారు. తన విజ్ఞప్తులపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించి, లేఖ పంపాలని చెప్పినట్టు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed