మృత్యు లారీ.. 9మందిని బలితీసుకుంది

by Anukaran |   ( Updated:2023-05-19 12:06:31.0  )
మృత్యు లారీ.. 9మందిని బలితీసుకుంది
X

దిశ ప్రతినిధి, నల్లగొండ/ దేవరకొండ: నాగార్జునసాగర్-హైదరాబాద్ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా పీఏపల్లి(పెద్దఅడిశర్లపల్లి) మండలంలోని అంగడిపేట స్టేజీ వద్ద గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరినాట్లు ముగించుకున్న కూలీలతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌తో పాటు ఆరుగురు మహిళలు అక్కడిక్కడే చనిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది.

దేవరకొండ మండలం చింతబావికి చెందిన 20 మంది కూలీలు యాసంగి సీజన్ కావడంతో నిత్యం వరినాట్లు వేసేందుకు ఇతర గ్రామాలకు వెళుతున్నారు. రోజులాగే పెద్దఆడిశర్లపల్లి మండలం రంగారెడ్డిగూడెంలో నాటేందుకు ఆటోలో వెళ్లారు. తిరిగి సాయంత్రం ఆరు గంటల సమయంలో అదే ఆటోలో ఇంటికి వస్తున్నారు. సరిగ్గా పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఏడుగురు మృతిచెందారు. మరో ఇద్దరు దేవరకొండ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 12 మంది తీవ్రంగా గాయపడగా, ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దేవరకొండ ఆస్పత్రి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. పీఏ పల్లి, కొండమల్లేపల్లి పోలీసులు సంఘటన స్థలంలో సహాయ చర్యలు చేపడుతున్నారు.

మృతిచెందినవారు

ప్రమాద సమయంలో ఆటోలో డ్రైవర్‌తో సహా 20 మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో డ్రైవర్ మినహా మిగతావారంతా మహిళలు. ప్రమాద సమయంలో అక్కడికక్కడే ఆరుగురు మరణించగా, మరొకరు దేవరకొండ ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరణించిన వారిలో మల్లేశం (ఆటోడ్రైవర్), కూలీలు నోమల పెద్దమ్మ, నోమల సైదమ్మ, కొట్టం పెద్దమ్మ, గొడుగు ఇద్దమ్మ, చంద్రమ్మ, అంజమ్మ, లింగమ్మ, అలివేలు ఉన్నారు. గాయపడిన వారిలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

నాగార్జునసాగర్-హైదరాబాద్ రహదారిపై నల్లగొండ జిల్లా అంగడిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యాక్సిడెంట్ కు దారితీసిన పరిస్థితులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాల పాలై.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వైద్యాధికారులను ఆదేశించారు. ప్రమాద ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపి.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

Next Story