మావోయిస్టు ఆర్కేపై ఎన్ఐఏ ఛార్జిషీట్

by Sumithra |
Maoist RK
X

దిశ, తెలంగాణ బ్యూరో : మావోయిస్టు పార్టీ నేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణతో పాటు మరో ఆరుగురి పేర్లను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తన ఛార్జిషీట్‌లో చేర్చింది. జర్నలిస్టు పాంగి నాగన్నతో పాటు మరో ఐదుగురు ప్రజాసంఘాల నాయకులు కూడా వీరిలో ఉన్నారు. గతేడాది నవంబరులో ముంచంగిపుట్టు పోలీసుస్టేషన్ పరిధిలో నమోదైన ఎఫ్ఐఆర్‌ను ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేసిన ఎన్ఐఏ ఈ ఛార్జిషీట్‌లో వారిపై భారత శిక్షాస్మృతిలోని 120-బి, 18, 20, 23, 38, 39 సెక్షన్ల కింద అభియోగాలను నమోదు చేసింది.

మావోయిస్టు పార్టీ ఆంధ్ర-ఒరిస్సా బార్డర్ జోనల్ కమిటీకి అడ్వయిజర్‌గా, ఇన్-చార్జిగా వ్యవహరిస్తున్న ఆర్కేతో వీరంతా సంబంధాల్లో ఉన్నారని, బైట నుంచి వివిధ రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారని ఎన్ఐఏ ఆ ఛార్జిషీట్‌లో పేర్కొన్నది.

గతేడాది నవంబరులో పాంగి నాగన్న జర్నలిస్టుగా చెప్పుకుంటూ మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్నారని, ఆయనను అదుపులోకి తీసుకున్న తర్వాత రాబట్టిన సమాచారం మేరకు ప్రజా సంఘాలకు చెందిన ఐదుగురిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం వారి పేర్లను ఛార్జిషీట్‌లో పెట్టినట్లు ఎన్ఐఏ పేర్కొన్నది. ఈ ప్రజాసంఘాలన్నీ మావోయిస్టు పార్టీకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్లుగా ఉన్నట్లు పేర్కొంది. ఎన్ఐఏ తన ఛార్జిషీటులో ఈ క్రిందివారి పేర్లను నమోదు చేసినట్లు తెలిపింది.

1. అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే (మావోయిస్టు పార్టీ)
2. పాంగి నాగన్న (జర్నలిస్టు)
3. కోటేశ్వరరావు (ప్రజా కళామండలి)
4. బొప్పూడి అంజమ్మ (అమరవీరుల బంధుమిత్రుల సంఘం)
5. రేలా రాజేశ్వరి (చైతన్య మహిళా సంఘం)
6. అందులూరి అన్నపూర్ణ (ప్రగతిశీల కార్మిక సమాఖ్య)
7. మానుకోండ శ్రీనివాసరావు (విప్లవ రచయితల సంఘం)

Advertisement

Next Story

Most Viewed