ఏఐ పోలీసమ్మ.. విధులు నిర్వర్తించేనమ్మా!

by Harish |
ఏఐ పోలీసమ్మ.. విధులు నిర్వర్తించేనమ్మా!
X

ఇప్పటివరకు గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా, సిరి అంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను నిత్యజీవితంలో ఉపయోగిస్తూనే ఉన్నాం. ఇప్పుడు కొత్తగా పోలీసు సేవలకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు వినియోగించే రోజులు వచ్చేశాయి. న్యూజిలాండ్ పోలీసు డిపార్డుమెంట్ వారు ఒక కొత్త ఏఐ పోలీసును విధుల్లోకి చేర్చుకోనున్నారు.

ఎల్లా అని పిలిచే ఈ ఏఐ పోలీసు వచ్చే సోమవారం రోజున విధుల్లో చేరనుంది. వెల్లింగ్టన్‌లోని జాతీయ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ఎల్లా విధులు నిర్వహించనుంది. ప్రస్తుతానికి అక్కడికి వచ్చిన వాళ్లకు స్వాగతం చెప్పడం, సహోద్యోగులకు చిన్న చిన్న అవసరాలు తీర్చడం, భవనం లోపల దారి చూపించడం వంటి పనులను మాత్రమే ఎల్లా చేయనుంది. మూడు నెలల పాటు ఈ ప్రాథమిక పనులను ఎల్లా నిర్వహించే విధానాన్ని పరిశీలించి, తర్వాత దాని పనితీరును అంచనా వేస్తారు. ఒకవేళ పనితీరు బాగుందని అనిపిస్తే మరికొన్ని పనులను ఎల్లాకు ప్రోగ్రామ్ చేస్తారు.

తర్వాత మనుషుల హావభావాలు, కదలికలను పసిగట్టి తన కంటూ సొంతంగా చేయగల పనులను ఎల్లా నేర్చుకునేలా ప్రోగ్రామ్ చేయనున్నారు. ప్రాథమిక స్థాయి అవసరాలకే తప్ప గల్లీల్లో పెట్రోలింగ్ చేయడం, గస్తీ నిర్వహించడం వంటి పనులకు ఎల్లాను వినియోగించబోమని న్యూజిలాండ్ పోలీసు కమిషనర్ మైక్ బుష్ అన్నారు. ఎల్లాను ఇంటెలా ఏఐ, సోల్ మెషీన్స్ అనే సంస్థలు సంయుక్తంగా తయారుచేశాయి.

Advertisement

Next Story

Most Viewed