టీమ్ ఇండియా క్రికెటర్లకు కొత్త నిబంధనలు

by Shyam |
టీమ్ ఇండియా క్రికెటర్లకు కొత్త నిబంధనలు
X

దిశ, స్పోర్ట్స్: డబ్ల్యూటీసీ ఫైనల్, 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడటానికి ఇంగ్లాండ్ వెళ్లనున్న టీమ్ ఇండియా క్రికెటర్లకు బీసీసీఐ కొత్త నిబంధనలు విధించింది. ఇండియాలో కరోనా సెకెండ్ వేవ్ తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆటగాళ్లు కరోనా బారిన పడి పర్యటనలో అవాంతరాలు తీసుకొని రాకుండా ఈ మార్గదర్శకాలు ఉపయోగపడతాయని బీసీసీఐ చెబుతున్నది. టీమ్ ఇండియా ఆటగాళ్లు ఇంగ్లాండ్ బయలుదేరడానికి ముందే 14 రోజుల పాటు ముంబైలో ఏర్పాటు చేసే బయోబబుల్‌లో ఉండాలి. అంతకు ముందే ప్రతీ ఆటగాడికి ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించి నెగెటివ్ వస్తేనే బయోబబుల్‌లోకి పంపుతారు.

ఇండియాలో క్వారంటైన్ ముగిసిన తర్వాత బయలుదేరే ముందు కూడా పరీక్షలు నిర్వహిస్తారు. అప్పుడు కూడా తప్పకుండా నెగెటివ్ ఫలితం రావాల్సిందే. ఇక వెళ్లే ముందే ఆటగాళ్లందరూ తొలి డోస్ కోవీషీల్డ్ వేయించుకోవల్సి ఉంటుంది. జూన్ 2న ఇంగ్లాండ్ బయలుదేరి వెళ్లనున్నారు. తొలి డోస్ వేయించుకున్న ఆటగాళ్లందరూ ఇంగ్లాండ్ వెళ్లిన తర్వాత రెండో డోస్ వేసుకోవల్సి ఉంటుంది. ఇందుకోసం ఈసీబీ ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వ అనుమతి తీసుకున్నది.

ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టిన తర్వాత ఈసీబీ ఏర్పాటు చేసే బయోబబుల్‌లో టీమ్ ఇండియా ఉండనున్నది. డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం వేరే బబుల్‌లోకి మారనున్నారు. అయితే అక్కడ బోర్డు అనుమతి లేకుండా ఆటగాళ్లు బయటకు వెళ్లే అవకాశం ఉండదు. ప్రతీ ఆటగాడికి జీపీఎస్‌తో కూడిన పరికరం ఇస్తారు. బబుల్ దాటి వెళ్తే సదరు ఆటగాడిపై కఠిన చర్యలు తీసుకుంటారని బీసీసీఐ చెప్పింది.

Advertisement

Next Story