కొత్త సచివాలయం చార్మినార్ కంటే హైటెక్కువ

by Shyam |
కొత్త సచివాలయం చార్మినార్ కంటే హైటెక్కువ
X

దిశ, న్యూస్ బ్యూరో: కొత్తగా నిర్మిస్తున్న సచివాలయం డిజైన్‌లోనే కాక మరికొన్ని అంశాల్లోనూ కొన్ని చారిత్రక కట్టడాలను తలపించే స్థాయిలో రూపుదిద్దుకోనుంది. తెలంగాణ రాష్ట్రంలోని పురావస్తు, చారిత్రక కట్టడాలను మాత్రమే కాక వివిధ రాష్ట్రాల్లోని కట్టడాల సరసన నిలిచేలా నిర్మాణం కానుంది.

డెక్కన్-కాకతీయ శైలిలో దీని డిజైన్‌ను రూపొందించినా కొన్ని పురాతన కట్టడాలకు దీటుగా ఉండేలా ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారు. నగరంలో 400 ఏళ్ళ నాటి చార్మినార్ కట్టడం కంటే ఎక్కువ ఎత్తు ఉండేలా 278 అడుగులతో ఇది నిర్మాణమవుతోంది. ఆ మాటకొస్తే తాజ్‌మహల్, కుతుబ్‌మినార్ కంటే ఎక్కువ ఎత్తుతో ఉంటోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో లేనంత గొప్పగా, భవిష్యత్ తరాలు దీని గురించి గొప్పగా చెప్పుకునేలా నూతన సచివాలయాన్ని నిర్మించనున్నట్లు మంత్రులే స్వయంగా వ్యాఖ్యానించారు.

సుమారు పాతిక ఎకరాల విస్తీర్ణంలో గరిష్టంగా మూడు ఎకరాల లోపే ఈ భవనం నిర్మాణమవుతున్నా మిగిలిన ప్రాంతమంతా పార్కులకు, వాహనాల పార్కింగ్‌కు, రోడ్లకు, క్యాంటీన్, మసీదు, ఆలయం, చర్చి తదితరాలకు పోతుంది. తక్కువ స్థలంలోనే నిర్మిస్తున్నా సకల సౌకర్యాలతో అన్ని అవసరాలకు సరిపోయే విధంగా డిజైన్ ఖరారైందని ముఖ్యమంత్రి కార్యాలయమే ప్రకటించింది. ఇప్పుడు చార్మినార్ గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో సచివాలయం గురించి కూడా అంతే గొప్పగా చెప్పుకోవాలన్నది ప్రభుత్వం అభిప్రాయం.

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గొప్పగా చెప్పుకుంటున్న తరహాలోనే ఇకపైన సచివాలయం గురించి చెప్పుకోవాలన్నది ముఖ్యమంత్రి భావన. నగరంలో అనేక భవనాలు ఎత్తుగా ఉన్నప్పటికీ సచివాలయానికి ఉన్న ప్రాధాన్యత వేరని, వాటితో పోల్చుకోలేమని అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. సుమారు ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడు అంతస్తులతో నిర్మాణమవుతున్న ఈ భవనం ఎత్తు బేస్‌మెంట్ నుంచి పైన ఉండే డోమ్ చివరి వరకూ 278 అడుగులు అని ఆర్కిటెక్ట్ ఆస్కార్ పేర్కొన్నారు.

నగరంలోని చార్మినార్ ఎత్తు 183 అడుగులైతే కొత్త సచివాలయం ఎత్తు మాత్రం 278 అడుగులు.
తాజ్ మహల్ ఎత్తు : 240 అడుగులు
కుతుబ్‌మినార్ ఎత్తు : 237 అడుగులు
కులీ కుతుబ్ షా సమాధుల ఎత్తు : 196 అడుగులు
హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధుడి విగ్రహం ఎత్తు : 58 అడుగులు

Advertisement

Next Story

Most Viewed