- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేషను కార్డులపై వారం ముందే కేంద్రం సర్క్యులర్
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర మంత్రివర్గం మూడు రోజుల క్రితం సమావేశమై కొత్త రేషను కార్డుల గురించి చర్చించింది. రెండు వారాల వ్యవధిలో సుమారు నాలుగున్నర లక్షల మంది అర్హులైనువారికి మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇంతకాలం ఈ విషయంపై పౌర సరఫరాల శాఖ పట్టించుకోకపోయినా మంత్రివర్గం హఠాత్తుగా నిర్ణయం తీసుకోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. రాష్ట్ర ప్రభుత్వం తనంతట తానుగా ఈ నిర్ణయం తీసుకుందా అనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ ఈ అంశంపై చర్చించడానికి వారం రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం నుంచి సర్క్యులర్ జారీ అయింది. కొత్త రేషను కార్డుల మంజూరుతో పాటు చౌక ధరల దుకాణాలు, కార్డుల ద్వారా పేదలకు నిత్యావసరాలు తదితరాలన్నింటిపై రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
కరోనా పరిస్థితుల్లో పేదలు ఆహారం కోసం ఇబ్బందులు ఎదుర్కోరాదన్న ఉద్దేశంతో కొత్త కార్డులను మంజూరు చేయాలని, ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టాలని ఆ లేఖలో ఆ శాఖ అండర్ సెక్రటరీ రాజేష్ కుమార్ పందీర్ జూన్ 2వ తేదీన (నెం. 24-37/2021-పీడీ-2-ఇ-374544) రాసిన లేఖలో స్పష్టం చేశారు. కొత్త కార్డులను మంజూరు చేయడంతో పాటు వారి ఆకలి తీర్చడానికి ఆహార పదార్ధాలను కూడా పంపిణీ చేయాలని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శులకు ఈ లేఖ రాశారు. జూన్ 2వ తేదీన ఈ లేఖ రాయగా తెలంగాణ మంత్రివర్గం జూన్ 8వ తేదీన సమావేశమై కొత్త రేషను కార్డుల గురించి చర్చించి నిర్ణయం తీసుకున్నది.
రాష్ట్రంలో 4.88 లక్షల దరఖాస్తులు పెండింగ్..
రాష్ట్ర వార్షిక బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలు పార్టీలకు చెందిన సభ్యులు మార్చి 17వ తేదీన పౌర సరఫరాల అంశానికి సంబంధించి మంత్రి గంగుల కమలాకర్‌ను ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు మంత్రి వివరణ ఇస్తూ, కొత్త రేషను కార్డుల కోసం 9,41,641 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 3,59,974 కార్డులను కొత్తగా మంజూరు చేశామని, 92,892 కార్డుల్ని అర్హమైనవి కావంటూ తిరస్కరించామని, ఇంకా 4,88,775 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని వివరించారు. అయితే కొత్త రేషను కార్డుల్ని దాదాపు 3.59 లక్షలకు పైగా మంజూరు చేసినట్లు మంత్రి కమలాకర్ పేర్కొన్నా సభ్యులు ఆ సమాధానంతో సంతృప్తి చెందలేదు. కొత్త రేషను కార్డులు జారీ కాలేదని, అంకెల్లో మాత్రమే అవి కనిపిస్తున్నాయని, నియోజకవర్గాల పర్యటనలో ప్రజలు తమను నిలదీస్తున్నారని ఎమ్మెల్యేలు సభాముఖంగానే వాపోయారు.
తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొత్త రేషను కార్డులపై చర్చ జరిగిన అనంతరం 4,46,169 కొత్త కార్డులను పదిహేను రోజుల వ్యవధిలో మంజూరు చేయాల్సిందిగా నిర్ణయం జరిగింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించిన తర్వాత ఇవి మాత్రమే ఆర్హమైనవిగా తేలినట్లు కేబినెట్ సమావేశం అభిప్రాయపడింది.
కేంద్రం లేఖతో కదలిక!
కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన లేఖ ప్రకారం కొత్త రేషను కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులైనవారిని గుర్తించి వీలైనంత తొందరగా మంజూరు చేయాలని అండర్ సెక్రటరీ పేర్కొన్నారు. కొత్త రేషను కార్డులు జారీ కాకపోవడం వలన పేదలు ఆహారానికి ఇబ్బంది పడుతున్నారంటూ పత్రికల్లో వార్తలు రావడం, ఎన్జీవో సంస్థల నుంచి విజ్ఞప్తులు రావడం, వ్యక్తులుగా కొద్దిమంది గ్రీవెన్స్ రూపంలో వారి బాధను వ్యక్తం చేయడం తదితరాలన్నింటి నేపథ్యంలో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు నొక్కి చెప్పాల్సి వచ్చిందని ఆ లేఖలో వివరణ ఇచ్చారు. రేషను కార్డులు, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు ఆహార పదార్థాల సరఫరా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త బాధ్యతగా ఉందని, అమలు మాత్రం రాష్ట్రాల పరిధిలోనే ఉందని పేర్కొన్నారు.
బలహీన వర్గాలు, వీధుల్లో బతికే నిరాశ్రయులు, చెత్త ఏరుకునేవారు, వీధి వ్యాపారులు, హాకర్లు, రిక్షా కార్మికులు, వలస కార్మికులు కరోనా పరిస్థితుల్లో ఆహారం దొరకక ఇబ్బంది పడుతున్నారని, ఇలాంటివారికి సకాలంలో నిత్యావసరాలను అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ అవసరం ఉన్నవారికి అడ్రస్ లేకపోయినందున కొత్త కార్డులను పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, అవసరమైతే వారి ఇండ్ల దగ్గరికే వెళ్ళి క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, జాతీయ ఆహార భద్రతా పథకం కింద కొత్త కార్డులను జారీ చేయాలని నొక్కిచెప్పారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రక్రియ పూర్తికావాలని, డ్రైవ్ ముగిసేంత వరకు ప్రతీ పదిహేను రోజులకు ఒకసారి స్టేటస్ రిపోర్టును కేంద్రానికి పంపించాలని అన్ని రాష్ట్రాల పౌర సరఫరాల శాఖ కార్యదర్శులను కేంద్ర అండర్ సెక్రటరీ ఆదేశించారు.