నాలుగేళ్లుగా ఎదురుచూపులు.. ఆ సమస్యలు పరిష్కారమయ్యేనా!

by Shyam |
నాలుగేళ్లుగా ఎదురుచూపులు.. ఆ సమస్యలు పరిష్కారమయ్యేనా!
X

దిశ, తెలంగాణ బ్యూరో: భూ రికార్డుల ప్రక్షాళనలో గుర్తించిన లోపాల సవరణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రెవెన్యూ యంత్రాంగమంతా ఏదో ఒక పనిలో తీరిక లేకుండా గడుపుతుండడంతో పట్టాదారు పాసు పుస్తకాలు పొందని నిజమైన భూ హక్కుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్లు చేసిన క్లారికల్​మిస్టేక్​లతోనూ పాసు పుస్తకాలు నిలిపివేయడం, చిన్న పొరపాట్లకే పాసు పుస్తకం ఇవ్వకుండా పెండింగులో పెట్టడాన్ని బాధితులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ధరణి పోర్టల్​అమలైన తర్వాత కూడా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని మండిపడుతున్నారు. ఎన్నాళ్లు కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటారంటూ రెవెన్యూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తరాలుగా హక్కుదారులుగా ఉన్నా పార్టు బీ లో నమోదు చేయడమేంటని తహసీల్దార్ ​కార్యాలయాల్లోనూ దరఖాస్తుదారుల నిరసనలు కనిపిస్తున్నాయి.

ఎప్పుడూ ఏదో ఓ పనిలో..

ఇన్నాళ్లుగా ప్రత్యేక రెవెన్యూ ట్రిబ్యునల్ బూచీగా చూపెట్టారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 16,940 ఆర్వోఆర్ కేసులకు ఆర్డర్లు తయారు చేసే పనిలోనే నిమగ్నమయ్యారు. 40 రోజులుగా ట్రిబ్యునల్​ పరిధిలోని కేసుల దస్త్రాలు పరిశీలించడం, వాటిపై స్పెసిఫికేషన్లు రాసి కలెక్టర్లకు పంపడంతోనే సరిపోయింది. తాజాగా ఆ కేసులన్నీ జీరోకు చేశామని యంత్రాంగం ప్రకటించినా ఆర్డర్లు మాత్రం జారీ చేయలేదు. ఇరుపక్షాలు సంతృప్తి చెందేలా కోర్టుకు వెళ్లి పరిష్కరించుకోవాలంటూ సూచించే అత్యధిక ఆర్డర్ల తయారీకే సమయం గడిపేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఆర్డర్ల జారీ ప్రక్రియ పూర్తయితే తప్ప మిగతా పనులు చేసేందుకు అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో పార్టు బీ దరఖాస్తుల పరిశీలన మొదలు పెట్టేందుకు మరో నెల రోజులైనా పట్టే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికిప్పుడు ఆ దస్త్రాలు ముందు వేసుకొని చూసే పరిస్థితుల్లో చాలామంది తహసీల్దార్లు, అదనపు కలెక్టర్లు, కలెక్టర్లు లేరని సమాచారం. పార్ట్​ బీ బాధితులంతా మరికొంత కాలం పరిష్కారానికి ఎదురు చూడాల్సిందేనంటున్నారు.

ముదురుతున్న వివాదాలు..​

తెలంగాణలో పార్టు బీ లో పేర్కొన్న భూమి హక్కులను ప్రశ్నార్థకం చేశారు. భూ రికార్డుల ప్రక్షాళనతో కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. నాలుగేండ్లుగా భూములకు హక్కులు దక్కుతాయో లేదోనన్న ఆందోళన నెలకొంది. ఒకటీ రెండు ఎకరాలు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల ఎకరాల భూమికి హక్కులను నిర్ణయించకుండా పెండింగులో ఉంచారు. ధరణి పోర్టల్ లో నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఏళ్లుగా సాగు చేస్తున్న భూములకు, తరతరాలుగా హక్కు పత్రాలు ఉన్నప్పటికీ పట్టాదారు పాసు పుస్తకాలను పెండింగులో ఉంచారంటూ వేలాది మంది ఆందోళనలో ఉన్నారు. మారుమూల తహసీల్దార్ కార్యాలయానికి రోజూ పదుల సంఖ్యలో బాధితులు వస్తున్నారు. పరిష్కారం ఇంకెప్పుడు చేస్తారంటూ తహసీల్దార్లను ప్రశ్నిస్తుండడంతో సమాధానం చెప్పలేక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. మరీ ముఖ్యంగా అవసరాలకు భూములను అమ్మాలనుకునే వారితో అధికారులకు మరింత ఇబ్బంది అవుతోంది. ధరణి పోర్టల్​లో నమోదు కాకపోవడంతో క్రయ విక్రయాలు జరగడం లేదని తహసీల్దార్లపై ఒత్తిడి చేస్తున్నారు. ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్​, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్​, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పార్టు బీ డేటాతో రైతులు, అధికారులు సమస్యలను ఎదుర్కొంటున్నారు.

కలెక్టర్లు అంటే కష్టమే..

పార్టు బీ సమస్యల పరిష్కారం కూడా కలెక్టర్ల చేతిలో పెట్టడంతో పరిష్కరించుకోవడం కష్టంగా మారుతోంది. క్షేత్ర స్థాయి తనిఖీ, దర్యాప్తు చేస్తే తప్ప ముందుకెళ్లడం కష్టం. సర్వే నెంబర్లలో క్షేత్ర స్థాయి విస్తీర్ణానికి, పహాణీల్లో నమోదైన విస్తీర్ణానికి మధ్య తేడాలు ఉన్నప్పుడు పట్టాదారులకు న్యాయం చేయడం అసాధ్యమంటున్నారు. ఏ పట్టాదారుడి పేరిటా తగ్గించే అవకాశం ఉండదు, అలా చేస్తే ఎవరూ అంగీకరించరు. సమగ్ర భూ సర్వే చేస్తే తప్ప పరిష్కారమయ్యేటట్లు లేదని ఓ రిటైర్డ్ ​జాయింట్ ​కలెక్టర్​అభిప్రాయపడ్డారు. పార్టు బీ కష్టాలకు ఇప్పటికిప్పుడు న్యాయం జరిగేటట్లు లేదంటున్నారు.

60 రోజులు అన్నారు..?

కోర్టుల విచారణలో ఉన్నవి మినహా, భూ రికార్డుల సమగ్ర సర్వే సందర్భంగా పార్ట్ – బీ లో పెట్టిన భూములకు సంబంధించిన అంశాలన్నింటినీ కలెక్టర్లు 60 రోజుల్లో పరిష్కరించాలని, అవసరమైన సందర్భాల్లో క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిర్ణయాలు తీసుకోవాలని, యాజమాన్య హక్కులను ఖరారు చేయాలని సీఎం కేసీఆర్ నెల రోజుల కిందట కలెక్టర్లను ఆదేశించారు. సరిహద్దు వివాదాలున్న చోట కలెక్టర్లు సర్వే నిర్వహించి, హద్దులు నిర్ణయించాలన్నారు. ఒకే సర్వే నెంబరులో ప్రభుత్వ, ప్రైవేటు భూములున్న చోట ఆ సర్వే నెంబరును నిషేధిత జాబితాలో పెట్టారు. అలాంటి పరిస్థితిలో కలెక్టర్లు విచారణ జరిపి, ఏది ప్రభుత్వ భూమో, ఏది ప్రైవేటుదో నిర్ణయించాలన్నారు. ఇప్పటికే నెల గడిచినా పార్టు బీ సమస్యల పరిష్కారానికి మాత్రం శ్రీకారం చుట్టలేదు.

సర్వేతోనే పార్టు బీ పరిష్కారం

పార్టు బీ లో నమోదైన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలంటే భూ సమగ్ర సర్వే అనివార్యమని రెవెన్యూ వర్గాలు, భూ చట్టాల నిపుణులు సూచిస్తున్నారు. సర్వే నెంబర్లలో ఆర్ఎస్ఆర్ విస్తీర్ణాలకు, పట్టాదారు పాసు పుస్తకాల్లోని మొత్తం విస్తీర్ణాలకు తేడా ఉంది. ఆ లెక్క తేల్చాలంటే సర్వే చేయడం మినహా సర్దుబాటు చేయడం అసాధ్యమంటున్నారు. అలాగే నాలా కన్వర్షన్లు, సర్వే నెంబర్ల మిస్సింగ్​, విస్తీర్ణాల్లో తప్పులు వంటి సమస్యల పరిష్కారం తేలికేమీ కాదంటున్నారు. ఇవన్నీ కలెక్టరే పరిష్కరించడమంటే జరిగే పని కాదని, ప్రభుత్వ పెద్దలు ఆలోచించి పార్ట్​ బీ సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో వ్యవస్థలు ఏర్పాటు చేయాలని దరఖాస్తుదారులు డిమాండ్​ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed