- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుత్తాధిపత్యానికి చెక్.. మద్యం వ్యాపారంలోకి కొత్త వ్యక్తులు
దిశ, భద్రాచలం(దుమ్మగూడెం): ఇంతకాలం దుమ్మగూడెం మండల మద్యం వ్యాపారంలో ఆ పెద్ద మనిషిదే గుత్తాధిపత్యం. ఆయన మాటకు అక్కడ తిరుగులేదు. దానికి కారణం ఆయన అక్కడ లోకల్ అనే ఫీలింగ్. అంతేగాక ఒక వైపు మద్యం (బినామీ) వ్యాపారిగా, మరోవైపు కాంట్రాక్టర్‌గా, ఇంకోవైపు రాజకీయ నాయకుడిగా త్రిముఖ పాత్ర పోషిస్తూ సంపాదించిన పరపతి, పలుకుబడి ఆయన గుత్తాధిపత్యానికి దోహదపడింది. అందుకే అక్కడ ఆయన మాటే వేదం. అలా సుమారు మూడున్నర దశాబ్దాలుగా దుమ్మగూడెం మండల మద్యం వ్యాపారంలో ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగిన ఆ పెద్ద మనిషి గుత్తాధిపత్యానికి తెరపడనున్నట్లు సమాచారం. మద్యం వ్యాపారంలోనూ, అలాగే దశాబ్దాలపాటు రాజకీయ అనుభవం కలిగిన చర్ల మండల ప్రాంతానికి చెందిన ఓ ఫ్యామిలీ దుమ్మగూడెం మండల మద్యం వ్యాపారంలో అడుగుపెట్టడంతో రసవత్తర పరిస్థితులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తిరగబడ్డ నో ఎంట్రీ బోర్డు
ఇతర ప్రాంతాలకు చెందినవారు ఆ మండలంలో వ్యాపారం చేయడానికి వీల్లేదనేది ఆయన హుకుం. ఒకవేళ ఎవరికైనా షాపులు వచ్చినా.. ఆయన ఇచ్చే డబ్బులు తీసుకుని తోకముడిచి పోవాల్సిందే తప్ప వ్యాపారం చేయడానికి వీల్లేదనేది ఆయన సిద్ధాంతం. నేనే రాజు, నేనే మంత్రి అనేది ఆయన వ్యూహం. అయితే మండల మద్యం వ్యాపారంలో ఆయన పెట్టిన నో ఎంట్రీ బోర్డు తిరగబడుతోంది. మద్యం వ్యాపారంలో తలపండిన ఆయనను ఢీకొట్టేందుకు చర్ల ప్రాంత వ్యాపారులు రెడీ అయ్యారు. అన్ని చోట్లలాగే ఇక్కడ కూడా సిండికేట్‌గా ఏర్పడి వ్యాపారం చేసుకుందామనే ప్రతిపాదనకు ఆ పెద్ద మనిషి ససేమిరా అంగీకరించకపోవడంతో ఎవరికి వారు స్వతంత్రంగా వ్యాపారం స్టార్ట్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సిండికేట్‌గా కలిస్తే ఓ రూపాయి లాభం. కలవకపోతే నష్టం అనేది తోటి వ్యాపారుల అభిప్రాయం. అయితే ఏకచ్ఛత్రాధిపత్యంగా సాగుతున్న దుమ్మగూడెం మండల మద్యం వ్యాపారంలో ఇతర ప్రాంతాల వారికి చోటిస్తే మున్ముందు తన ఆధిపత్యానికి, ఆదాయానికి నష్టమనేది సదరు పెద్ద మనిషి ఆలోచనగా తెలుస్తోంది.
అయితే దుమ్మగూడెం మండలంలో గల మూడు షాపుల్లో ఒక షాపు దక్కించుకున్న చర్ల ప్రాంత వ్యాపారులు వ్యాపారం స్టార్ట్ చేయక ముందే తమ ఎత్తుగడలు ప్రారంభించినట్లుగా సమాచారం. మద్యం వ్యాపారంలో గల అనుభవానికి తోడు తమకున్న రాజకీయ పరపతి, పలుకుబడిని ఉపయోగిస్తూ ఓవైపు ఎక్సైజ్ అధికారుల అండదండలు, మరోవైపు సదరు పెద్దమనిషిని వ్యతిరేకించే రాజకీయ శక్తుల సహకారంతో అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. సదరు పెద్ద మనిషిని ఆర్థికంగా దెబ్బతీయాలని ఎంతోకాలంగా ఎదురుచూసే వారంతా పరోక్షంగా, ప్రత్యక్షంగా చర్ల వ్యాపారులకు చేయూతనిచ్చే అవకాశాలు లేకపోలేదు.
సిండికేట్ వద్దు.. ఎమ్మార్పీ ముద్దు
ఈసారి దుమ్మగూడెం మండలంలో మద్యం వ్యాపారులు సిండికేట్ కావడం లేదనే శుభవార్త మందుబాబుల్లో తెగ ఆనందం కలిగిస్తోంది. సిండికేట్ అయితే ధరలు పెంచి దండుకుంటారనేది జగమెరిగిన సత్యం. సిండికేట్ కాకుంటే వ్యాపారంలో పోటీతత్వం వలన MRP ధరలకే అమ్మక తప్పదు. కనుక సిండికేట్ వద్దు. ఎమ్మార్పీ ముద్దు అని మురిసిపోతున్నారు. అయితే వ్యాపారుల నడుమ పంతాలు, పట్టింపులు ఎంతోకాలం ఉండవని, నష్టం కొని తెచ్చుకోవడం కంటే లాభాలు ఆర్జించడం కోసం వ్యాపారులు ఓ మెట్టుదిగి రాజీపడక తప్పదనే అభిప్రాయం లేకపోలేదు.