కొండపోచమ్మ భూనిర్వాసితుల కోసం కొత్త గజ్వేల్: కేసీఆర్

by Shyam |
కొండపోచమ్మ భూనిర్వాసితుల కోసం కొత్త గజ్వేల్: కేసీఆర్
X

దిశ, మెదక్: కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవం అనంతరం సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రైతులకు మరో మూడు రోజుల్లో తీపి కబురు చెప్పబోతున్నట్లు ప్రకటించారు. ‘అదేంటన్న సస్పెన్షన్ ఉండాలి. దేశమంతా ఆ విషయమేంటన్న ఆలోచనలో ఉండాలి.’ అంటూ కేసీఆర్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని మర్కూక్, పాములపర్తి గ్రామాల సమీపంలోని కొండపోచమ్మ రిజర్వాయర్‌ను చినజీయర్ స్వామిజీతో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రైతులకు త్వరలోనే తీపి కబురు చెబుతానని ప్రకటించారు. రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు ప్రపంచంలో ఎక్కడా లేవని స్పష్టం చేశారు. ప్రపంచమే ఆశ్చర్యపోయే విషయం త్వరలో చెప్తానన్నారు. ప్రాజెక్ట్‌ భూనిర్వాసితులకు, వారి పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రైతులు గర్వంగా బతికే రోజులు త్వరలోనే రానున్నాయని కేసీఆర్ అన్నారు.

ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం

‘ కొండపోచమ్మసాగర్ ప్రారంభం తెలంగాణ చరిత్రలో ఉజ్వలమైన ఘట్టం. ప్రాజెక్ట్ కోసం భూములిచ్చిన రైతులకు తలవంచి నమస్కారం చేస్తున్నా. వారి త్యాగం విలువ కట్టలేనిది. వారి వల్లే లక్షలాది ఎకరాలు సాగులోకి వస్తాయి. ప్రాజెక్టు భూనిర్వాసితులకు మంచి పరిహారం ఇచ్చాం. గూడు చెదిరిన పక్షులా ఉన్నవారిని దృష్టిలో ఉంచుకుని కొత్త గజ్వేల్ నగరం నిర్మిస్తాం. భూ నిర్వాసితులకు ప్రభుత్వ సహకారం ఉంటుంది. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే విధంగా ప్రాజెక్టుల రూపకల్పన చేశాం. ఇందులో భాగంగా గోదావరి జలాలను ఒడిసి పట్టేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నాం’. అని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద రిజర్వాయర్‌గా మల్లన్నసాగర్ 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నామని అన్నారు. ప్రాజెక్ట్ నిర్వహణకు 4.8 వందల మెగా వాట్ల విద్యుత్ అవసరమని కేసీఆర్ అన్నారు. ఎలాంటి పన్నులు లేకుండానే రైతులకు సాగునీరు అందిస్తామన్నారు.

జీవ నదులుగా మంజీర, హల్ది

దేశ వ్యాప్తంగా 83 లక్షల టన్నుల వరి ధాన్యం ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేస్తే, తెలంగాణ నుంచే 53 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. ఆరేళ్ల క్రితం అనాథగా.. ఆగమైన తెలంగాణలో నేడు పసిడి పంటలు పండుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్ మినహా మిగతా ప్రాంతాలకు సాగునీరు అందుతుందన్నారు. జహీరాబాద్‌కు సింగూరు ద్వారా సాగునీరు అందిస్తామన్నారు. మంజీర, హల్ది నదులను జీవనదులుగా మారుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, సీఎం రాజకీయ సలహాదారు శేరీ సుభాష్ రెడ్డి, ఒంటేరు ప్రతాప్ రెడ్డి, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed