కొనుగోలు కేంద్రాల్లో నయా మోసం.. రైతుల్లో ఆవేదన

by Sridhar Babu |
కొనుగోలు కేంద్రాల్లో నయా మోసం.. రైతుల్లో ఆవేదన
X

దిశ, మల్లాపూర్: అన్యాయం చేస్తున్నారని ఓ వైపున రైతులే కొనుగోలు కేంద్రాలపై దాడులు చేస్తున్నా.. నిర్వహాకులు మాత్రం తమ దోపిడీని తగ్గించుకోవడం లేదు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో అయినా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి. కొత్త పద్ధతిలో ఐకేపీ నిర్వాహకులు మోసాలకు పాల్పడుతూ.. రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కష్టపడి పండించిన పంటని అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే నెలలు గడిచినా కొనడం లేదని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కేవలం బడా రైతుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తూ సన్న, చిన్నకారు రైతులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని వాల్గొండ ఐకేపీ సెంటర్‌లో చోటు చేసుకున్న నిర్వహకుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. ఓ చిన్న కారు రైతు తాను పండించిన వరి పంటను కొనుగోలు కేంద్రానికి గత నెల 11న తీసుకురాగా ఇప్పటివరకు కొనుగోలు కేంద్రంలో తూకం వేయలేదు. తనలాంటి సన్నకారు రైతులను పట్టించుకోవడం లేదని సదరు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన వడ్లు ఎండిపోయి తీరని నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను పట్టించుకోవడం లేదని అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కళ్లాల్లో స్థలాలు లేక రోడ్డుపై తాము వడ్లను పోసి నెల రోజులగా ఆరబెడుతున్నా మాయిశ్చర్ సరిగ్గా లేదంటూ తప్పించుకుంటున్నారన్నారు. ఉన్నతాధికారులు ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలలో ఏం జరుగుతుందో తెలుసు కోకపోవడంతోనే ఇదంతా జరుగుతుందని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. ఐకేపీ కొనుగోలు కేంద్రం ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు సదరు ఏపీఎం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించకపోవడం గమనార్హం. కొనుగోలు కేంద్రాలకి వచ్చి రైతుల సమస్యలు తెలుసుకోవాల్సిన ఉన్నతాధికారులే సందర్శించకపోవడంతోనే సమస్యలు తలెత్తుతున్నాయని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా ఉండగా మొన్నటి వరకు మండలంలో తూకాల్లో మోసం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ గ్రామంలో తూకాలలో ఎలాంటి మోసం చేయకపోగా.. కొనుగోలు కేంద్రాలలో పనులు చేస్తున్న హమాలీలకు 28 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా రైతుల నుండి 35 రూపాయలు వసూలు చేస్తూ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. హమాలీలలో పెద్ద వారితో మాట్లాడగా తమకి 32 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని.. మిగతా డబ్బులతో తమకు సంబంధం లేదని చెబుతున్నారు.

సదరు నిర్వాహకుడు వీవోఏని అడగగా తమ కింది స్థాయి సిబ్బంది హమాలీల కొరత ఉందని తెలుపగా.. వేరే రాష్ట్రాల నుండి తీసుకువచ్చామని.. వారి ఖర్చుల రీత్యా 35 రూపాయలు వసూలు చేస్తున్నామని నిజాన్ని ఒప్పుకున్నారు. హమాలీలకు 32 రూపాయలు ఇస్తూ మూడు రూపాయలు ఎటు వెళ్తున్నాయి అని అడగగా నిర్వాహకుడు తడబడ్డాడు. ఈ తంతు అంతా ఉన్నతాధికారి ఏపీఎంని అడగగా కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న విషయం తమకు తెలియదని వెళ్లి విచారణ చేపడతామని తప్పించుకోవడం కొసమెరుపు.

Advertisement

Next Story

Most Viewed