విద్యుత్ సంస్థలకు అప్పులిక కష్టమే!

by Shyam |   ( Updated:2020-04-12 08:02:55.0  )
విద్యుత్ సంస్థలకు అప్పులిక కష్టమే!
X

దిశ, న్యూస్ బ్యూరో : లాక్‌డౌన్ వల్ల రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థల(డిస్కంలు)కు నష్టాలు పెరగనుండటంతో వాటికి అప్పులిచ్చే విషయంలో రుణసంస్థలు పలు షరతులు పెడుతున్నట్టు తెలుస్తోంది. నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్-19) వ్యాప్తి కట్టడికి రాష్ట్రంలో, దేశంలో లాక్‌డౌన్ అమలవుతుండటం వల్ల సమీప భవిష్యత్తులో డిస్కంలు నగదు కొరతను ఎదుర్కోనుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మార్చి 22న ప్రారంభమైన జనతా కర్ఫ్యూ నుంచి రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పడిపోయిన విషయం తెలిసిందే. సాధారణ సమయాల్లో డిస్కంల నష్టాలను క్రాస్ సబ్సిడీ పేర కొంత వరకు కవర్ చేసే వాణిజ్య, పారిశ్రామిక రంగాలు ప్రస్తుతం పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో డిస్కంలకు ప్రతి నెల బిల్లుల వసూలు ద్వారా వచ్చే నగదు తగ్గిపోనుంది.

ఇక అధిక కనెక్షన్లుండే గృహ వినియోగం కేటగిరీలోనూ ఈ నెల బిల్లుల రీడింగ్ తీసేదిలేదనీ, గతేడాది మార్చి నెలలో వచ్చిన బిల్లునే చెల్లించాలని డిస్కంలు ఇప్పటికే కస్టమర్లను కోరాయి. ఎవరో వాడుకున్న గతేడాదికి సంబంధించిన అధిక బిల్లులు ఎలా చెల్లిస్తామని కస్టమర్లు ప్రశ్నిస్తుండటంతో వివాదాస్పదమైన ఈ పద్ధతిలో బిల్లులు ఎంత వరకు వసూలవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక వ్యాపారం నడవని కమర్షియల్, ఉత్పత్తి ఆగిపోయిన ఇండస్ట్రియల్ కేటగిరిలో మార్చి నెల బిల్లులను 50 శాతం చెల్లించాలని ఈ కేటగిరి కస్టమర్లను డిస్కంలు కోరాయి. మూడింట రెండు వంతులు వ్యాపారాలు నడిచిన మార్చి నెల బిల్లులంటే ఎలాగోలా ఈ కేటగిరిలో చెల్లించినప్పటికీ ఏప్రిల్ నెల బిల్లులైతే అసలు వసూలయ్యే పరిస్థితి లేదు. దీంతో తెలంగాణలో ఉన్న రెండు డిస్కంలైన టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్‌లకు వసూలవ్వాల్సిన మార్చి విద్యుత్ బిల్లుల మొత్తం భారీగా తగ్గనున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు ఎలాంటి బిల్లులు వసూలు కాని వ్యవసాయ రంగానికి విద్యుత్ ఇచ్చినందుకు ప్రభుత్వమివ్వాల్సిన సబ్సిడీ రూ.400 కోట్లు ఏప్రిల్ నెల నుంచి టైముకు వచ్చే పరిస్థితి లేదు. లాక్‌డౌన్ వల్ల ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయమే పూర్తిగా తగ్గిపోవడం దీనికి కారణం.

ఈ ఆర్థిక సంవత్సరానికి‌గాను ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయ, ఇతర సబ్సిడీలకు కలిపి ప్రభుత్వం రెండు డిస్కంలకు కలిపి రూ.10వేల400 కోట్లు కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ ఉన్న పరిస్థితుల దృష్ట్యా చూస్తే ఈ మొత్తం ప్రభుత్వానికి భారమేనని చెప్పక తప్పదు.

వ్యవసాయ సబ్సిడీలు ఎప్పటికప్పుడు విడుదలవకపోవడం, గృహ విద్యుత్ కేటగిరిలో విద్యుత్ కొనుగోలు, సరఫరాకు ఖర్చు పెట్టిన మొత్తం తిరిగి రాకపోవడంతో రాష్ట్ర రెండు డిస్కంలు ఇప్పటికే వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయి. కరోనా దెబ్బకు వాయిదానష్టాలను కొద్దిగా పూడ్చుకోవడానికి ఈ ఏప్రిల్ 1 నుంచి చార్జీలు పెంచడానికి ప్రభుత్వం, డిస్కంలు చేసిన ప్రయత్నాలు సైతం కరోనా దెబ్బకు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. డిస్కంల సగటు సరఫరా ఖర్చు(ఏసీఎస్), సగటు రెవెన్యూ రియలైజేషన్(ఏఆర్ఆర్) మధ్య భారీ గ్యాప్ ఉంటోంది. ఈ గ్యాప్ ఉత్తర ప్రాంత డిస్కం అయిన టీఎస్ఎన్పీడీసీఎల్ కంటే హైదరాబాద్ నగరంలో విద్యుత్ పంపిణీ చేసే టీఎస్ఎస్పీడీసీఎల్‌కు ఎక్కువగా ఉంది. అంటే గృహ, వాణిజ్య, పరిశ్రమల కనెక్షన్లున్న టీఎస్పీడీసీఎల్ ఎక్కువ విద్యుత్ కొని పంపిణీ చేసి ఆ ఖర్చు రికవర్ కాక అధికంగా నష్టాలపాలవుతోంది. ఇప్పుడు లాక్ డౌన్ ప్రభావం వల్ల ఈ కేటగిరిలోని కస్టమర్ల మీదే ఉంది. దీంతో టీఎస్ఎస్పీడీసీఎల్ మరింత నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇక టీఎస్ ఎన్పీడీసీఎల్ వ్యవసాయ కనెక్షన్లు ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వ సబ్సిడీ డబ్బుల కోసం వేచి చూసే పరిస్థితిలో ఉంది. విద్యుత్ బిల్లులు వసూలైనా కాకపోయినా ఈ రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు కరెంటు మళ్లీ కొని కస్టమర్లకు సరఫరా చేయాల్సిందే.

గ్యారంటీలు కావాల్సిందేనని షరతు ఇప్పటికే అప్పుల్లో ఉన్న ఈ సంస్థలు విద్యుత్ పంపిణీ సంస్థలు ఇలా కరెంటు కొనడానికి మరిన్ని అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. సాధారణ పరిస్థితుల్లో అయితే ఈ అప్పులు పుట్టడం వీటికి పెద్ద కష్టమేమీ కాకపోయినప్పటికీ ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో మాత్రం అప్పుల విషయంలో పెద్ద కష్టమే వచ్చి పడింది. రెగ్యులర్‌గా డిస్కంలకు అప్పులిచ్చే కేంద్ర ప్రభుత్వ సంస్థలైన పీఎఫ్‌సీ, ఆర్ఎఫ్‌సీ లాంటి కేంద్ర ప్రభుత్వ రుణ సంస్థలు కొత్త రుణాలు కావాలంటే ప్రభుత్వ బ్యాంకు గ్యారంటీలు కావాల్సిందే అని షరతు పెడుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గ్యారంటీ ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్‌బీఎమ్ చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. ఇదే కాక డిస్కంల ఆర్థిక పరిస్థితి మెరుగు పర్చడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉదయ్ స్కీం నిబంధనలను సైతం సడలించాల్సి ఉంటుందని సమాచారం. ఈ స్కీం నిబంధనల ప్రకారం దీన్ని అమలు చేస్తున్న అన్ని డిస్కంలు తమ గత ఏడాది రెవెన్యూలో 25 శాతం మాత్రమే నిర్వహణ పెట్టుబడి కోసం అప్పు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం బిల్లులు సరిగా వసూలయ్యే పరిస్థితులు లేకపోవడంతో కొత్త నిర్వహణ అప్పులకు ఈ నిబంధన అడ్డంకిగా మారనున్నదని తెలుస్తోంది. ఈ నిబంధనలను తాత్కాలికంగా సవరించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు లాక్ డౌన్ వల్ల విద్యుత్ డిమాండ్ పడిపోవడంతో పీపీఏలు చేసుకున్నఅన్ని జెన్‌కోల దగ్గర డిస్కంలు విద్యుత్ కొనే పరిస్థితి లేదు. ఇలా విద్యుత్ కొనలేని సందర్భంలో ఆయా జనరేటింగ్ కంపెనీలకు ఫిక్స్‌డ్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది డిస్కంలకు పెద్ద భారంగా పరిణమించే అవకాశముంది. దీంతో ఈ విషయంలోనూ డిస్కంలకు ఉపశమనం కలిగించే విషయంలోనూ కేంద్రం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇవన్నీ జరిగితే తప్ప ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్ర డిస్కంలు మరింత సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags:telangana, lock down, discom, power bills, debt raising, central government

Advertisement

Next Story

Most Viewed