నాలుగేళ్ల కింద హామీ.. ట్విట్టర్‌లో ప్రశ్నిస్తే స్పందించిన KTR

by Anukaran |   ( Updated:2021-09-07 03:16:53.0  )
నాలుగేళ్ల కింద హామీ.. ట్విట్టర్‌లో ప్రశ్నిస్తే స్పందించిన KTR
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో ప్రస్తుతం స్పందన కార్యక్రమాన్ని అంతంతమాత్రంగానే అమలు చేస్తుండటంతో ట్విట్టర్ వేదికగా సమస్యలను ప్రభుత్వ అధికారులకు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తున్నారు. అందులోనూ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో ఎప్పుడూ అందుబాటులో ఉంటూ స్పందిస్తున్న విషయం తెలిసిందే.

కానీ, దీనిపై కొన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోగ్య సమస్యలపై ఇబ్బందులు పడుతున్నవారికి సాయం చేస్తుండటం బాగుందని.. ప్రభుత్వం సాంక్షన్ చేసినా ఎందుకు జాప్యం చేస్తున్నారని.. వెంటనే పరిహారాన్ని ఇప్పించేందుకు ఎవరో ఒకరు గుర్తు చేయాల్సిందేనా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్ కేటీఆర్‌ను ట్యాగ్ చేసి ట్వీట్ చేయగా కేటీఆర్ స్పందించారు.

నెటిజన్ ట్వీట్ ప్రకారం..‘‘ పండించిన పంటకి నష్టం రావడంతో ఆత్మహత్యలు చేసుకున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అందులో సూర్యాపేట జిల్లాకి చెందిన ఓ మహిళ ఆరేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది. అయితే, ఆమెకు రూ.6లక్షలు ఇచ్చేందుకు 2017లో నిర్ణయించారు. నాలుగేళ్లు గడుస్తున్నా.. అవి రాకపోవడంతో ఆమె కుమారులు మహేష్, మనీష్‌లు ఇబ్బందులు పడుతున్నారు.

ఆమె చనిపోయిన తర్వాత, భర్త మల్లయ్య మతిస్థిమితం కోల్పోయారు. మల్లయ్య తండ్రి కూడా వృద్ధుడు అవడంతో కళ్లు కనిపించక ఇంట్లోనే ఉంటున్నారు. ఆమె కుమారులు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వెంటనే వారికి రావాల్సిన పరిహారాన్ని ఇప్పించండి’’ అంటూ కేటీఆర్‌ని ట్విట్టర్‌లో కోరారు. కేటీఆర్ స్పందిస్తూ..‘‘ తన దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు.. వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు వెళ్లాలని ఆదేశిస్తూ’’ ట్వీట్ చేశారు. దీనిపై కొందరు నెటిజన్లు హర్షం వ్యక్తం చేయగా.. మరికొందరు.. సాంక్షన్ చేసిన నగదును నాలుగేళ్లుగా ఇవ్వకుండా ఏం చేస్తున్నారని విమర్శించారు. ట్విట్టర్‌లో గుర్తుచేసి, వ్యవసాయ అధికారులను పంపించే వరకూ పరిహారం విషయం గుర్తురాలేదా.. అంటూ ట్విట్టర్‌లో ఫైర్ అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed