నెట్‌ఫ్లిక్స్‌లో ‘పాక్షిక డౌన్‌లోడ్’ ఫీచర్

by Shyam |
నెట్‌ఫ్లిక్స్‌లో ‘పాక్షిక డౌన్‌లోడ్’ ఫీచర్
X

దిశ, ఫీచర్స్ : కరోనా లాక్‌డౌన్‌ వల్ల ఓటీటీలే కొత్త సినిమా సందడికి వేదికలుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయా ప్లాట్‌ఫామ్స్ మధ్య పోటీ కూడా పెరిగింది. దాంతో కొత్త కొత్త ఫీచర్స్‌తో న్యూ యూజర్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి కంపెనీలు. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ‘పార్షియల్ డౌన్‌లోడింగ్’ ఫీచర్‌‌ను లాంచ్ చేసింది.

అమెరికన్ దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ప్రస్తుతం ఇండియాలోనూ ఆన్-డిమాండ్ వీడియో స్ట్రీమింగ్ సర్వీస్‌గా మారిపోయింది. ప్లా్ట్‌ఫామ్‌లోని కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ 2016 నుంచే ఉంది. ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసిన వారి జాబితాలో ఇండియా టాప్ ప్లేస్‌లో ఉంది. అయితే సినిమా లేదా సిరీస్ డౌన్‌లోడ్ చేస్తుండగా డేటా/ఇంటర్నెట్ సమస్యలతో మధ్యలో ఆగిపోతే ఇక అంతే సంగతి. మళ్లీ మొదటి నుంచి ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. కానీ తాజా ఆప్షన్‌లో సినిమాలు పూర్తిగా డౌన్‌లోడ్‌ కాకపోయినా పాక్షికంగా వీడియోలను చూసే అవకాశం కల్పించింది. దీనివల్ల యూజర్లు ఇంటర్నెట్‌ డేటా సేవ్ చేసుకునే ప్రయోజనం పొందుతారు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ కేవలం ఆండ్రాయిడ్‌ యూజర్లకు మాత్రమే. ఐవోస్‌ వెర్షన్‌ ఫీచర్ కూడా త్వరలోనే రానుందని సమాచారం.

వినియోగదారులు సినిమాలను డౌన్‌లోడ్ చేయడానికి డేటాతో ఇబ్బందిపడుతున్నారని గ్రహించిన నెట్‌ఫ్లిక్స్ ఈ ఆప్షన్ తీసుకొచ్చింది. తొందరలోనే మరిన్ని ఫీచర్లను ప్రవేశపెట్టడానికి నెట్‌ఫ్లిక్స్ ప్రయత్నిస్తుందని, యూజర్లకు ఆహ్లాదాన్ని, వినోదాన్ని అందించేందుకు మేము ఈ సేవను అందిస్తున్నామని నెట్‌ఫ్లిక్స్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ గ్రెగ్ పీటర్స్ అన్నారు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో నెట్‌ఫ్లిక్స్ ఆండ్రాయిడ్‌లో ‘డౌన్‌లోడ్స్ ఫర్ యూ’ను ప్రారంభించింది. ఇది యూజర్ మొబైల్‌లో సిఫార్సు చేసిన వాటిని ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ చేస్తుంది. ఈ ఫీచర్ ఇప్పటికీ iOS లో పరీక్షిస్తుండగా త్వరలో మార్కెట్‌లోకి రానుంది.

Advertisement

Next Story

Most Viewed