- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీ-నితీశ్‌లకు జనహారతి
దిశ, న్యూఢిల్లీ: బిహారీలు డబుల్ ఇంజన్ సర్కారుకే సై అన్నారు. ఎన్‌డీఏ కూటమికే పట్టం కట్టారు. గత సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 40 పార్లమెంటు స్థానాల్లో 39 సీట్లు ఎన్‌డీఏ కూటమికే కట్టబెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా, మూడు విడతల్లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ అదే కూటమికి బొటాబొటి మెజారిటీతో అధికారాన్ని అందించారు. డబుల్ ఇంజన్ సర్కారును గెలిపించాలని, తద్వారా అభివృద్ధి పరుగులు పెరుగుతుందని ప్రధాని మోడీ చేసిన సూచనలకు ప్రజలు జై కొట్టారు. ఫలితంగా 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌లో ఎన్‌డీఏ స్వల్ప ఆధిక్యతను సాధించి అధికారాన్ని పదిలం చేసుకుంది.
బిహార్‌లో బీజేపీ 74 స్థానాలు, జేడీయూ 43 స్థానాలు, హిందుస్తాన్ ఆవామ్ మోర్చా (హెచ్ఏఎం), వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ నాలుగేసి స్థానాలను గెలుచుకున్నాయి. ఎల్‌జేపీ ఒక్కసీటునే గెలుచుకోగలిగింది. మొత్తంగా ఎన్‌డీఏ మ్యాజిక్ ఫిగర్‌ను దాటి 125 సీట్లను కైవసం చేసుకుంది. మహాగట్‌బంధన్ మెజార్టీకి 12 సీట్ల దూరంలో చతికిలపడిపోయింది. ఆర్జేడీ 75 సీట్లు, కాంగ్రెస్ 19 సీట్లు, లెఫ్ట్ పార్టీలు 16 సీట్లను గెలుచుకున్నాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో గతనెల 28వ, ఈ నెల 3వ, 7వ తేదీల్లో జరిగాయి. వీటి ఫలితాలను ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది.
ఓట్ల లెక్కింపు ఆసాంతం ఉత్కంఠగా సాగింది. కౌంటింగ్ మొదలు సాయంత్రం వరకు ఎన్‌డీఏ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మహా ఘట్‌బంధన్ ప్రచార కార్యక్రమాల్లోని ప్రజల హోరు ఫలితాల్లో కనిపించలేదు. సాయంత్రం వరకు ఎన్‌డీఏ కంటే చాలా వెనుకబడింది. రాత్రి ఏడెనిమిది గంటలకు ఎన్‌డీఏతో పోటాపోటీ ప్రదర్శనను కనబరిచింది. యువ నేత తేజస్వీ యాదవ్ సారథ్యంలో ఆర్జేడీ గత ఎన్నికల్లో కంటే మెరుగైన ఫలితాలను రాబట్టింది. కానీ, మహాగట్‌బంధన్ కూటమి మెజార్టీ సాధించలేకపోయింది.
సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆర్జేడీ
75 స్థానాలతో ఆర్జేడీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. 74 స్థానాలతో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినప్పటికీ ఆర్జేడీ ప్రతిపక్షంలోనే ఉండిపోనుంది. రెండు, మూడో స్థానాల్లో నిలిచిన బీజేపీ, జేడీయూ అధికారాన్ని అందుకోనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆర్జేడీ 80 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అప్పుడు జేడీయూతో కలిసి ఆర్జేడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అవినీతి ఆరోపణలు రావడతో సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. నితీశ్ రాజీనామాతో జేడీయూ-ఆర్జేడీ ప్రభుత్వం కూలిపోయింది. బీజేపీ మద్దతుతో జేడీయూ మళ్లీ అధికారాన్ని అధిరోహించగా, ఆర్జేడీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినప్పటికీ మళ్లీ ప్రతిపక్షంలోనే కూర్చుంది.
జూనియర్‌గా జేడీయూ
ఇన్నాళ్లు ఎన్‌డీఏ కూటమిలో జేడీయూ పెద్దపార్టీగా, బీజేపీ జూనియర్ పార్టీగా కొనసాగాయి. రెండో అతిపెద్ద పార్టీగా సాగిన జేడీయూ తాజ ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోయింది. ఎన్‌డీఏలోనూ బీజేపీకి జూనియర్ పార్టీగా మారింది. రాజకీయాల్లో బీజేపీ ప్రధానపార్టీగా అవతరించింది. గత ఎన్నికల్లో 67 స్థానాలను గెలుచుకున్న జేడీయూ తాజాగా 42 స్థానాలకే పరిమితమైంది.
మళ్లీ సీఎం నితీశ్ కుమార్
జేడీయూ కంటే అత్యధిక సీట్లు బీజేపీ సాధించడంతో కాబోయే ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఉత్కంఠ ఏర్పడింది. సీట్ల పంపకాల సమయంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థిపై బీజేపీ, జేడీయూలో అంతర్గతంగా ఆశలు, అసంతృప్తులు రేగాయి. ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వరకు అందరూ తమ సీఎం క్యాండిడేట్ నితీశ్ కుమారేనని ప్రకటించారు. ఫలితాల్లో జేడీయూ కంటే ఎక్కువ సీట్లు బీజేపీ గెలుచుకున్నా నితీశ్ సారథ్యంలోనే సర్కారును ఏర్పాటు చేస్తామని తెలిపారు. బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించడంతో సీఎం కుర్చీపై అనిశ్చితి నెలకొంది. ముఖ్యమంత్రి కుర్చీపై వివాదానికి తావులేదని, నితీశే తమ ముఖ్యమంత్రి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ స్పష్టం చేశారు.
ఎగ్జిట్ పోల్స్ తారుమారు
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్‌డీఏ విజయకేతనం ఎగరేసింది. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ నేతృత్వంలోని మహాగట్‌బంధన్ ఆధిక్యాన్ని సాధిస్తుందని, లేదంటే హంగ్ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. వీటిని తలకిందులు చేస్తూ బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఎన్‌డీఏ మెజార్టీకి ఆమడ దూరంలోనే ఆగిపోతుందని దాదాపు అన్ని ఏజెన్సీలు అంచనా వేశాయి. మహాగట్‌బంధన్‌కే మొగ్గు చూపాయి. స్పష్టమైన మెజార్టీ ప్రకటించనప్పటికీ విపక్షాలే అధికారాన్ని చేజిక్కించుకుంటాయని అభిప్రాయపడ్డాయి. కానీ, ఫలితాలు ఈ అంచనాలను తారుమారు చేశాయి. ఎన్‌డీఏనే అధికారాన్ని హస్తగతం చేసుకుంది.