‘‘మీరు సామాన్యులు కాదు.. ఒక మంత్రి.. ఆ మాత్రం తెలియదా ..?’’ ‘సనాతన’ వ్యాఖ్యలపై ఉదయనిధికి సుప్రీం హితవు

by Hajipasha |   ( Updated:2024-03-04 13:25:32.0  )
‘‘మీరు సామాన్యులు కాదు.. ఒక మంత్రి.. ఆ మాత్రం తెలియదా ..?’’ ‘సనాతన’ వ్యాఖ్యలపై ఉదయనిధికి సుప్రీం హితవు
X

దిశ, నేషనల్ బ్యూరో : సనాతన ధర్మాన్ని ఉద్దేశించి తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ‘‘రాజ్యాంగం మీకు అందించిన వాక్ స్వాతంత్య్రాన్ని మీరే అగౌరవపర్చుకున్నారు. మత స్వేచ్ఛా హక్కును మీరే ఉల్లంఘించుకున్నారు. ఇప్పుడు మీ హక్కును రక్షించాలంటూ మీరే కోర్టును ఆశ్రయించారు. మీరు చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి పరిణామాలు ఉంటాయో మీకు తెలియదా ?.. మీరు సామాన్యులేం కాదు కదా. మీరు ఒక మంత్రి. జరగబోయే పరిణామాలన్నీ మీకు తెలిసే ఉంటాయి’’ అని సుప్రీం ధర్మాసనం ఉదయనిధిని మందలించింది. గతేడాది సెప్టెంబరులో తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తనయుడు ఉదయనిధి మాట్లాడుతూ.. ‘‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి’’ అని కామెంట్ చేయడం వివాదానికి దారితీసింది. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ఉదయనిధిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో అప్పట్లో పిటిషన్‌ దాఖలైంది. దాన్ని విచారణకు స్వీకరించిన ధర్మాసనం ఉదయనిధికి నోటీసులు జారీ చేసింది.

ఎఫ్‌ఐఆర్‌లు అన్నింటినీ కలిపి ఒకేచోట విచారణ

ఈ అంశంపై దేశంలోని పలు రాష్ట్రాల్లోనూ కేసులు నమోదయ్యాయి. ఆ ఎఫ్‌ఐఆర్‌లన్నింటినీ కలిపి ఒకేచోట విచారించాలంటూ ఉదయనిధి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై తాజాగా సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం పైవ్యాఖ్యలు చేసింది. ఎఫ్‌ఐఆర్‌లను ఒకే చోట విచారించే అంశంపై ఆయా రాష్ట్రాల హైకోర్టులనే ఆశ్రయించాలని ఉదయనిధి స్టాలిన్‌ తరఫు న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వికి సుప్రీం ధర్మాసనం తొలుత సూచించింది. దీనికి సింఘ్వీ బదులిస్తూ.. ‘‘ఇప్పటికే మేం ఆయా హైకోర్టులను ఆశ్రయించాం. అయితే గతంలో అమిష్‌ దేవగన్‌, అర్నబ్‌ గోస్వామి, నుపుర్‌ శర్మ, మొహమ్మద్‌ జుబెర్‌ కేసుల్లో నిందితులకు న్యాయస్థానాలు ఊరట ఇచ్చాయి. వారిపై దాఖలైన పిటిషన్లన్నీ కలిపి ఒకేచోట విచారించారు. అదే కోవలో ఉదయనిధి స్టాలిన్‌ వ్యవహారాన్ని పరిశీలించగలరు’’అని కోరారు. దీంతో ఉదయనిధి స్టాలిన్‌ పిటిషన్‌ను పరిశీలిస్తామని చెబుతూ తదుపరి విచారణను సుప్రీంకోర్టు మార్చి 15వ తేదీకి వాయిదా వేసింది.తన వ్యాఖ్యలపై గతంలో ఉదయనిధి స్టాలిన్‌ పలు సందర్భాల్లో బహిరంగ వివరణ ఇచ్చుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యల్ని మరోలా అర్థం చేసుకున్నారని.. సమాజంలో దుష్టశక్తులెన్నో పెరిగిపోవడానికి సనాతన ధర్మం ఒక కారణం అవుతోందని మాత్రమే తాను అన్నానని చెప్పారు. అయినప్పటికీ విమర్శలను ఎదుర్కొనేందుకు.. న్యాయపరమైన పోరాటం చేయడానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed