Bajaj Finance: పని ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడిన బజాజ్ ఫైనాన్స్ ఉద్యోగి

by S Gopi |
Bajaj Finance: పని ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడిన బజాజ్ ఫైనాన్స్ ఉద్యోగి
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా వివిధ కంపెనీల్లో ఉద్యోగులు పని ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో బజాజ్ ఫైనాన్స్ కంపెనీలో ఏరియా మేనేజర్ పనిచేస్తున్న తరుణ్ అనే ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు నెలలుగా సీనియర్ ఉద్యోగుల నుంచి టార్గెట్ పూర్తి చేయాలని వస్తున్న ఒత్తిడిని ఎదుర్కోలేకపోవడంతో పాటు, జీతం తగ్గింపుపై బెదిరింపులకు భయపడి జీవితం చాలించాలని నిర్ణయించుకున్నట్టు ఉద్యోగి తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. సోమవారం ఉదయం పనిమనిషి తన ఇంటికి వచ్చే సమయానికి తరుణ్ ఉరివేసుకుని కనిపించాడు. అతని భార్య, ఇద్దరు పిల్లలను మరో గదిలో తరుణ్ లాక్ చేసి ఉంచినట్టు పనిమనిషి గుర్తించారు. తరుణ్ మృతదేహాన్ని గుర్తించిన అనంతరం పనిమనిషి సమీపంలో ఉన్న తరుణ్ సోదరుడికి సమాచారం అందించారు. ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందించగా, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. దీనిపై పోలీసు అధికారులు ఫిర్యాదు నమోదు చేసి, తదుపరి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. 'పనిలో మరిన్ని టార్గెట్‌లను సాధించాలని తరుణ్‌కు ఒత్తిడి పెరిగిందని, అప్పటికే టార్గెట్‌లను పూర్తి చేయని కారణంతో జీతం తగ్గించారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్టు' అతని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి బజాజ్ ఫైనాన్స్ ఇంకా స్పందించలేదు.

Advertisement

Next Story

Most Viewed