కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా ఇవ్వం.. సీపీఎంను వదిలితేనే పొత్తు : దీదీ

by Hajipasha |
కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా ఇవ్వం.. సీపీఎంను వదిలితేనే పొత్తు : దీదీ
X

దిశ, నేషనల్ బ్యూరో : పశ్చిమ బెంగాల్‌లో ఇండియా కూటమి పార్టీల పొత్తులపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎదుట దీదీ ఒక షరతు పెట్టారు. తమ పార్టీతో పొత్తు పెట్టుకునే ఇంట్రెస్ట్ ఉంటే సీపీఎం నుంచి విడిపోవాలని హస్తం పార్టీకి సూచించారు. ‘‘సీట్ల పంపకాల చర్చల సమయంలో కాంగ్రెస్‌కు రెండు లోక్‌సభ సీట్లను మేం ప్రపోజ్ చేశాం. రాష్ట్ర అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని కాంగ్రెస్‌కు రెండు లోక్‌సభ సీట్లంటే పెద్ద విషయమే. దానికి ఆ పార్టీ నో చెప్పింది. ఇప్పుడు కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా ఇచ్చే ఆలోచన నాకు లేదు’’ అని మమతా బెనర్జీ తేల్చిచెప్పారు. బెంగాల్‌లోని మాల్డాలో జరిగిన ఒక సభలో దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘గతంలోనూ పలు సందర్భాల్లో సీపీఎం శ్రేణులు నాపై భౌతిక దాడి చేశాయి. నన్ను నిర్దాక్షిణ్యంగా కొట్టారు. శ్రేయోభిలాషుల ఆశీస్సుల వల్లే నేను ఇంకా బతికి ఉన్నాను. వామపక్షాలను ఎప్పటికీ క్షమించలేను. ప్రత్యేకించి సీపీఎంను క్షమించలేను. ఈరోజు సీపీఎంతో ఉన్నవాళ్లు.. రేపు బీజేపీతో కూడా కలుస్తారేమో’’ అని మమతా బెనర్జీ కీలక కామెంట్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బిహార్ నుంచి బెంగాల్‌లోకి ప్రవేశించిన వేళ దీదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Advertisement

Next Story