కర్ణాటకలో మహిళను నగ్నంగా ఊరేగించి.. స్తంభానికి కట్టేసిన ఘటన

by Harish |
కర్ణాటకలో మహిళను నగ్నంగా ఊరేగించి.. స్తంభానికి కట్టేసిన ఘటన
X

బెంగళూరు: కర్ణాటకలోని బెళగావి సిటీ శివారులో ఉన్న హోస వంతామరి గ్రామంలో అమానుషం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువకుడు, 18 ఏళ్ల యువతి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే యువతి కుటుంబీకులు ఆమెకు మరో వ్యక్తితో సోమవారం రోజు మ్యారేజ్ ఎంగేజ్‌మెంట్‌‌కు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రోగ్రామ్ జరగడానికి కొన్ని గంటల ముందు యువతి, యువకుడు కలిసి ఊరి నుంచి పారిపోయారు.

ఈ ఘటనతో యువతి కుటుంబీకులు రగిలిపోయారు. అమ్మాయిని తీసుకెళ్లిన యువకుడి ఇంటిపై దాదాపు 10 మంది మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. యువకుడి తల్లిని నగ్నంగా చేసి రోడ్డుపై స్తంభానికి కట్టేశారు. అనంతరం ఆమెను వీధిలో ఊరేగిస్తూ దాడి చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని బాధిత మహిళను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె బెళగావి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

నిందితులపై కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం వెతుకుతున్నారు. రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర ఆస్పత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. మహిళపై అమానుషంగా ప్రవర్తించిన వారిని వదిలేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు.

Advertisement

Next Story