Wolf Attacks : మ్యాన్ ఈటర్ తోడేళ్ల కలకలం.. ‘వన్యప్రాణి విపత్తు ప్రభావిత ప్రాంతం’గా బహ్రయిచ్

by Hajipasha |
Wolf Attacks : మ్యాన్ ఈటర్ తోడేళ్ల కలకలం.. ‘వన్యప్రాణి విపత్తు ప్రభావిత ప్రాంతం’గా బహ్రయిచ్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్ జిల్లా మహాసీ తహసీల్ పరిధిలో ఉన్న ఏజెన్సీ ఏరియాల్లో తోడేళ్లు రెచ్చిపోతున్నాయి. ఇప్పటివరకు వాటి దాడుల్లో దాదాపు పది మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఏడుగురు పిల్లలే ఉన్నారు. 30 మందికిపైగా గాయాలతో ఆస్పత్రుల్లో చేరారు. ఆరు తోడేళ్లు ఈ దాడులకు పాల్పడినట్లు గుర్తించగా.. ఆపరేషన్ భేడియా పేరుతో అటవీశాఖ అధికారులు ప్రత్యేక సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి నాలుగు తోడేళ్లను పట్టుకున్నారు. మరో రెండు తోడేళ్లను పట్టుకునేందుకు ఆపరేషన్ భేడియా కొనసాగుతోంది. మహాసీ తహసీల్‌ ప్రజలకు తోడేళ్ల భయంతో కంటి మీద కునుకు లేకుండాపోయింది.

ఈనేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. బహ్రయిచ్ జిల్లాను ‘వన్యప్రాణి విపత్తు ప్రభావిత ప్రాంతం’గా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. ఈవిషయాన్ని యూపీ మత్స్యశాఖ మంత్రి సంజయ్ కుమార్ నిషాద్ బుధవారం వెల్లడించారు. దీనివల్ల మ్యాన్ ఈటర్‌లుగా మారిన తోడేళ్లను పట్టేందుకు ఉద్దేశించిన ఆపరేషన్ భేడియా వేగాన్ని పుంజుకుంటుందని ఆయన తెలిపారు. తోడేళ్ల దాడి వల్ల నష్టపోయిన వారు, బాధిత కుటుంబాలు సులభంగా ప్రభుత్వ సాయాన్ని పొందేందుకు ఈ గుర్తింపు దోహదం చేస్తుందని మంత్రి చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed