ఎన్ఎస్‌ఏగా అజిత్‌ డోభాల్‌ పునర్నియామకం

by Hajipasha |
ఎన్ఎస్‌ఏగా అజిత్‌ డోభాల్‌ పునర్నియామకం
X

దిశ, నేషనల్ బ్యూరో : విశ్రాంత ఐపీఎస్‌ అధికారి అజిత్‌ డోభాల్‌‌ను మరోసారి జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ)గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన నియామకానికి కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ గురువారం ఆమోద ముద్ర వేసింది. 2024 జూన్‌ 10 నుంచి మొదలుకొని ప్రధాని మోడీ పదవీకాలం పూర్తయ్యేవరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు డోభాల్‌ ఎన్‌ఎస్‌ఏగా ఉంటారని కేంద్ర ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఈ పదవీకాలంలో డోభాల్‌కు క్యాబినెట్ మంత్రి హోదాను కేటాయిస్తారు. మోడీ నేతృత్వంలోని ఎన్డీయే తొలిసారి అధికారంలో వచ్చిన టైంలో 2014 మే 30న డోభాల్‌ తొలిసారి ఎన్‌ఎస్‌ఏగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టర్‌గా పనిచేశారు.ఇక విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పీకే మిశ్రాను ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పదవిలో కొనసాగిస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.

అజిత్‌ డోభాల్‌‌ గురించి..

ఉత్తరాఖండ్ ​(ఒకప్పటి ఉమ్మడి ఉత్తరప్రదేశ్)లో అజిత్‌ డోభాల్‌‌ 1945 సంవత్సరంలో జన్మించారు. ఆయన 1968 బ్యాచ్ ​కేరళ కేడర్ ఐపీఎస్ అధికారి. 2005 సంవత్సరంలోనే ఐబీ డైరెక్టర్‌ హోదాలో డోభాల్ పదవీ విరమణ చేశారు. 2014లో కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడగానే భారతదేశ ఐదో జాతీయ భద్రతా సలహాదారుగా డోభాల్‌కు అవకాశం కల్పించింది. 2016 సంవత్సరంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో భారత్ ​జరిపిన లక్షిత దాడులు, 2019లో బాలాకోట్‌ వైమానిక దాడుల వ్యూహరచనలో డోభాల్ కీలకపాత్ర పోషించారు. ఇక డోక్లాం అంశం విషయంలో చైనాతో భారత్ పరిస్థితులను చక్కబెట్టడానికి ఆయన చాలా కృషి చేశారు.

Advertisement

Next Story

Most Viewed