ప్రత్యేక హోదా హామీని నెరవేర్చుతారా?..మోడీని ప్రశ్నించిన కాంగ్రెస్

by vinod kumar |
ప్రత్యేక హోదా హామీని నెరవేర్చుతారా?..మోడీని ప్రశ్నించిన కాంగ్రెస్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పిస్తామన్న హామీని నెరవేర్చుతారా అని ప్రధాని మోడీని కాంగ్రెస్ ప్రశ్నించింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మీడియాతో మాట్లాడారు. మోడీ 3. 0 ప్రభుత్వం ఏర్పడుతుందని పదేపదే చెబుతున్నారని, అయితే ఇది మోడీ 1/3 ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. ‘ఏప్రిల్ 30, 2014న పవిత్ర నగరమైన తిరుపతిలో ఏపీకి భారీ పెట్టుబడులు వచ్చేలా ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చి పదేళ్లు గడుస్తున్నా అది జరగలేదు. ఇప్పుడు ఆ హామీని నెరవేరుస్తారా? అని నిలదీశారు. విశాఖలోని స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

దీనిని అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని ఈ ప్రక్రియను ఇప్పటికైనా నిలిపివేస్తారా లేదా సమాధానం చెప్పాలన్నారు. అలాగే బిహార్‌కు ప్రత్యేక హోదా కల్పించడం ద్వారా 2014 ఎన్నికల హామీని, తన మిత్రపక్షం, జేడీయూ అధినేత నితీష్‌ కుమార్‌ పదేళ్ల డిమాండ్‌ను నెరవేరుస్తారా అని కూడా ప్రశ్నించారు. దీనిపై మోడీ మౌనం వీడాలన్నారు. ‘దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహించాలని మేము డిమాండ్ చేశాం. నితీశ్ కుమార్ కూడా దీనికి మద్దతు ఇచ్చారు. బిహార్‌లో చేసినట్లుగా దేశవ్యాప్తంగా కుల గణనను నిర్వహించాలి’ అని డిమాండ్ చేశారు. జేడీయూ చీఫ్ నితీశ్, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు మద్దతుతో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో జైరాం రమేశ్ వ్యాఖ్యలు హాట్‌టాపిక్ గా మారాయి.

Advertisement

Next Story