తన భార్యను చంపిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి: ముంబై బీఎండబ్ల్యూ ప్రమాద బాధితుడు

by S Gopi |   ( Updated:2024-07-08 15:29:26.0  )
తన భార్యను చంపిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి: ముంబై బీఎండబ్ల్యూ ప్రమాద బాధితుడు
X

దిశ, నేషనల్ బ్యూరో: ముంబైలోని వర్లీలో సోమవారం బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ ఘటనలో మరణించిన 45 ఏళ్ల మహిళ భర్త నిందితుడు మిహిర్ షాను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తన భార్యపై ఎలాగైతే అతను ఎక్కించాడో అదే విధంగా అతనిపై ఎక్కిస్తానని తీవ్రమైన ఆవేదనతో స్పందించారు. కారు డ్రైవ్ చేసిన వ్యక్తి సకాలంలో బ్రేక్‌లు తీసి ఉంటే తన భార్యను రక్షించేవాడని చెప్పారు. వర్లీ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు కావేరి నఖ్వా భర్త ప్రదీప్ లీలాధర్ నఖ్వా మీడియాతో మాట్లాడుతూ.. ఆదివారం ఉదయం క్రాఫోర్డ్ మార్కెట్ నుంచి చేపలు కొని తిరిగి వస్తుండగా, సుమారు తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో వారి స్కూటర్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ ఢీకొట్టింది. కారు ఢీకొట్టిన వేగానికి మేము దాని బానెట్‌పై పడ్డాం. డ్రైవర్ బ్రేక్ వేయడంతో తాను పడిపోయానని, కానీ తన భార్య ఫ్రంట్ వీల్ కింద పడింది. తాను బానెట్‌ను కొట్టి కారు ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆపలేదని జరిగిన ఘటనను దుఃఖిస్తూ వివరించారు.

ఉద్వేగంతో మాట్లాడిన ప్రదీప్ నఖ్వా.. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన భార్య మరణంతో సర్వం కోల్పోయాం. దీనికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. అయితే, ఈ ప్రమాదంలో కారును శివసేన నేత రాజేష్ షా కుమారుడు నడిపినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగినప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలోనే పోలీసులు మిహిర్ తండ్రి రాజేష్ షాను అరెస్ట్ చేశారు. అయితే, అరెస్ట్ అయిన ఒకరోజు తర్వాత ముంబై కోర్టు అతనికి రూ. 15 వేల బాండ్‌పై బెయిల్ మంజూరు చేసింది. ప్రమాద సమయంలో మిహిర్ మద్యం మత్తులో ఉన్నాడని, కొద్ది గంటల ముందు జుహూలోని బార్‌లో కనిపించాడని అనుమానిస్తున్నారు. అయితే మిహిర్ బార్‌లో ఉండగా రెడ్ బుల్ మాత్రమే తాగాడని బార్ యజమాని చెప్పాడు. కాగా, నిందితుడు మిహిర్‌ దేశం విడిచి వెళ్లిపోయే అవకాశమున్న నేపథ్యంలో పోలీసులు అతనిపై లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశారు. ఆరు బృందాలు అతనికోసం గాలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed