రిపబ్లిక్ డే వేడుకలు: ‘కర్తవ్యపథ్‌’లో నిర్వహించేది అందుకే?

by samatah |
రిపబ్లిక్ డే వేడుకలు: ‘కర్తవ్యపథ్‌’లో నిర్వహించేది అందుకే?
X

దిశ, నేషనల్ బ్యూరో: 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకునేందుకు భారత్ సిద్ధమవుతోంది. న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సెలబ్రేషన్స్‌కు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మ్యాక్రాన్‌ను భారత్ ఆహ్వానించింది. గణతంత్ర దినోత్సవం 2024 థీమ్ ‘ఇండియా-మదర్ ఆఫ్ డెమోక్రసీ’, ‘వికసిత్ భారత్’గా ఉంది. రిపబ్లిక్ డే సందర్భంగా కర్తవ్యపథ్‌లో నిర్వహించే పరేడ్, త్రివిధ దళాల కవాతు, సైనిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ వేడుకలను ప్రత్యక్షంగా తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి అనేక మంది అక్కడికి వెళ్తుంటారు. అయితే ప్రతి ఏటా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కర్తవ్యపథ్ లోనే ఎందుకు నిర్వహిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కింగ్స్‌వే టూ కర్తవ్యపథ్

కర్తవ్యపథ్‌ను గతంలో రాజ్‌పథ్ అని పిలిచేవారు. ఇది రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు విస్తరించి ఉంటుంది. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ రహదారికి చారిత్రక హిస్టరీ ఉంది. ఇది భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించింది. 1911లో బ్రిటిష్ ప్రభుత్వం తమ రాజధానిని కతకత్తా నుంచి ఢిల్లీ మార్చాలని నిర్ణయం తీసుకుంది. దీంతే అదే ఏడాది కర్తవ్యపథ్ నిర్మాణం మొదలు పెట్టారు. దీనికి మొదట కింగ్స్ వే అని పేరు పెట్టగా.. స్వాతంత్య్రం అనంతరం రాజ్‌పథ్‌గా మార్చారు. సెప్టెంబరు 2022లో సెంట్రల్ విస్టా డెవలప్ మెంట్ ప్రాజెక్టులో భాగంగా దీనిని ప్రధాని నరేంద్ర మోడీ కర్తవ్య్ పథ్‌గా మార్చారు. వలస పాలన నుంచి స్వేచ్ఛా వాయువులు పీల్చ డానికి కర్తవ్యపథ్ సాక్షిగా ఉంది. అంతేగాక సార్వభౌమ ప్రజాస్వామ్యం, గణతంత్రం వరకు భారతదేశ ప్రయాణంలో చిహ్నంగా నిలిచింది. ఈ క్రమంలోనే గత ఏడు దశాబ్దాలుగా కర్తవ్యపథ్ గణతంత్ర వేడుకలను ఆతిథ్యం ఇస్తోంది.

రేపు భారత్‌కు రానున్న మాక్రాన్

గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవనున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గురువారం భారత్‌కు రానున్నారు. మొదట ఆయన రాజస్థాన్‌లోని జైపూర్ విమానాశ్రయంలో దిగనున్నారు. మాక్రాన్‌కు ఘన స్వాగతం పలికేందుకు మోడీ ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం భారత్-ఫ్రాన్స్‌ల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు ప్రధాని మోడీ, మాక్రాన్‌లు భేటీ కానున్నారు. భారత్ ప్రతిపాదించిన 26 రాఫెల్-ఎమ్ ఫైటర్ జెట్‌లు, మూడు స్కార్పెన్ సబ్‌మెరైన్‌ల సేకరణ వంటి విషయాలు చర్చల్లో ప్రస్తవించనున్నట్టు తెలుస్తోంది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఫ్రెంచ్ వైమానిక దళానికి చెందిన రెండు రాఫెల్ ఫైటర్ జెట్‌లు, ఎయిర్‌బస్ A330 మల్టీ-రోల్ ట్యాంకర్ రవాణా విమానాలు పాల్గొననున్నాయి.

Advertisement

Next Story

Most Viewed