Blackbucks: 550 ఏళ్లు.. బిష్ణోయిలకు - కృష్ణజింకలకు మధ్య ఉన్న బంధం ఇదే !

by Y.Nagarani |   ( Updated:2024-10-15 13:31:51.0  )
Blackbucks: 550 ఏళ్లు.. బిష్ణోయిలకు - కృష్ణజింకలకు మధ్య ఉన్న బంధం ఇదే !
X

దిశ, వెబ్ డెస్క్: 1998లో జరిగిన రెండు కృష్ణజింకల హత్య.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను నేటికీ వెంటాడుతూనే ఉంది. హమ్ సాత్ సాత్ హై సినిమా షూటింగ్ సమయంలో జోధ్ పూర్ సమీపంలో రెండు కృష్ణజింకల (Blackbucks)ను సల్మాన్ ఖాన్ తో కలిసి పలువురు హత్య చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ (Baba Siddique), సల్మాన్ ఖాన్ (Salmankhan)లకు బెదిరింపులు పెరిగాయి. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయి చాలాసార్లు సల్మాన్ ఖాన్ ను చంపాలని ట్రై చేశాడు. బహిరంగంగానే అతడిని చంపేస్తానని చెప్పాడు కూడా. ఈ క్రమంలో ఇటీవలే బాబా సిద్ధిఖీ హత్యకు గురైన విషయం తెలిసిందే. అసలు బిష్ణోయిలకు కృష్ణజింకలంటే ఎందుకంత గౌరవం. వాటిని ఎందుకు అంతలా ఆరాధిస్తారు. సల్మాన్ ఖాన్ పై బిష్ణోయిలకు అంత కోపం దేనికి ? కృష్ణ జింకల్ని చంపినందుకే సల్మాన్ ఖాన్ ను చంపాలని లారెన్స్ బిష్ణోయ్ అనుకుంటున్నాడా? లేక అతడిని చంపడం ద్వారా.. గ్యాంగ్ స్టర్ గా ఎదగాలని ఇదంతా చేస్తున్నాడా? ఇలాంటి ప్రశ్నలు చాలామంది మెదడులలో మెదులుతూ ఉన్నాయి.

550 ఏళ్ల నాటి బంధం

బిష్ణోయ్ అనేది ఒక మతం కాదు. ఒక సంఘం. 15వ శతాబ్దంలో గురు జంభేశ్వర్ (జంబాజీ) బిష్ణోయ్ సంఘాన్ని స్థాపించారు. 29 సూత్రాలతో జంబాజీ ఈ సంఘంలో ఉన్నవారికి మార్గనిర్దేశం చేశారు. అతని బోధనలు.. వన్యప్రాణులు, వృక్షసంపద, వాటి సంరక్షణను సూచిస్తాయి. బిష్ణోయ్ తత్వశాస్త్రంలో చెప్పిన ప్రధాన సిద్ధాంతాల్లో ఒకటి.. కృష్ణజింకల్ని రక్షించుకోవడం అని 2018లో బిష్ణోయ్ కమ్యూనిటీ సభ్యుడు రామ్ స్వరూప్ చెప్పాడు. జంబాజీ మరణించేముందు.. కృష్ణజింకల్ని తన పునర్జన్మగా భావించాలని చెప్పారట. అప్పటి నుంచి బిష్ణోయ్ లుగా మరణించినవారు జింకలుగా పునర్జన్మ పొందుతారని ఆ సంఘంలో ఉన్నవారు నమ్ముతారు. ఈ విషయాన్ని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్ (UCLA) చరిత్రకారుడు వినయ్ లాల్ బిష్నోయిలపై జరిపిన పరిశోధనలో చెప్పారు. ఇలా కృష్ణజింకలతో బిష్ణోయిలకు ఉన్న బంధం 550 ఏళ్ల నాటిది.

రాజస్థాన్ కు చెందిన అనిల్ బిష్ణోయ్ అనే రైతు, కార్యకర్త 10 వేల కృష్ణజింకలు, చింకరాలను రక్షించాడు. ఓసారి కృష్ణజింకల్ని వేటాడిన ఓ వేటగాడు.. 5 జింకల్ని చంపాక అతని తలపై తుపాకీని గురిపెట్టాడు. జింకల్ని రక్షించేందుకు తన ప్రాణాల్ని సైతం అర్పించేందుకు కూడా అతను వెనుకాడలేదని నాడు ఓ నేషనల్ మీడియా కథనాన్ని ప్రచురించింది. ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో అతను కూడా ఏదే చెప్పుకొచ్చాడు.

జోధ్ పూర్ మహారాజు హత్యాకాండ

1730లో జోధ్ పూర్ సమీపంలోని ఖేజర్లీ గ్రామంలో చెట్లను నరకకుండా అడ్డుపడిన 362 మంది బిష్ణోయిలు హత్యకు గురయ్యారు. అప్పటి జోధ్ పూర్ మహారాజు అభయ్ సింగ్ ఆదేశాలతో ఈ హత్యాకాండ జరిగింది. అమృతాదేవి అని మహిళ నేతృత్వంలో బిష్ణోయ్ సంఘం ప్రతిఘటించింది. ఇదే 1973 చిప్కో ఉద్యమానికి ఊతమిచ్చింది.

శతాబ్దాల కాలంగా బిష్ణోయిలు కృష్ణజింకలు, చింకరాలు, వృక్షసంపదతో మమేకమై ఉన్నారు. బిష్ణోయిల్లో ఉన్న ఆడవాళ్లు.. తల్లిలేని జింకలకు స్వయంగా పాలిచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. కృష్ణజింకలను తమ గురువు జంబాజీగా భావిస్తారు కాబట్టి.. వాటిని చంపాలని వచ్చిన వారిని తరిమికొడతారు బిష్ణోయిలు. అయితే లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్ ఖాన్ పై ఇంత పగ పెంచుకోవడం వెనుక ఉన్న కారణం ఇదేనా ? అన్న ప్రశ్నకు మాత్రం కచ్చితమైన సమాధానం లేదు.

Advertisement

Next Story

Most Viewed