UP BJP Report : యూపీలో బీజేపీ ఓటమికి 6 కారణాలు.. హైకమాండ్‌కు నివేదిక

by Hajipasha |
UP BJP Report : యూపీలో బీజేపీ ఓటమికి 6 కారణాలు.. హైకమాండ్‌కు నివేదిక
X

దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీ హైకమాండ్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ ఎందుకు చతికిలపడిందనే దానిపై కారణాలను తెలుసుకునేందుకు రాష్ట్ర పార్టీ యూనిట్‌తో క్షేత్రస్థాయి అధ్యయనం చేయించింది. ఇందులో భాగంగా దాదాపు 40వేల మందిని సర్వే చేశారు. ఈ స్టడీలో ఆరు ముఖ్యమైన కారణాలను గుర్తించారు. అవేమిటంటే.. తరుచుగా పేపర్ లీక్‌ ఘటనలు, ప్రభుత్వ విభాగాల్లో పెద్దఎత్తున కాంట్రాక్టు సిబ్బంది నియామకం, అధికార యంత్రాంగం పెత్తందారీతనం, కీలకమైన సామాజిక వర్గాల మద్దతు తగ్గడం, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పార్టీ నేతల వ్యాఖ్యలు, లోక్‌సభ టికెట్ల పంపిణీ చాలాముందుగా జరగడం. ఈ కారణాలే లోక్‌సభ పోల్స్‌లో పార్టీని దెబ్బతీశాయని బీజేపీ పెద్దలకు యూపీ బీజేపీ యూనిట్ సమర్పించిన నివేదికలో ప్రస్తావించారు.

ఎమ్మెల్యేలు కనీస ప్రయారిటీకి నోచుకోక..

నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలకు కనీస ప్రయారిటీ లేని రితీలో జిల్లా మెజిస్ట్రేట్లు, ఇతర ఉన్నతాధికారుల పెత్తనం నడిచిందని పేర్కొన్నారు. దీంతో బీజేపీ క్యాడర్ తమకు ప్రయారిటీ దక్కడం లేదనే నైరాశ్యానికి లోనయిట్లు క్షేత్ర స్థాయి అధ్యయనంలో గుర్తించారు. గత మూడేళ్లలో యూపీలో 15 పేపర్ లీక్ ఘటనలు జరగడం యువతను బీజేపీకి దూరం చేశాయని నివేదికలో తెలిపారు. కుర్మి, మౌర్య, దళిత సామాజిక వర్గాలలో చాలామంది బీజేపీకి దూరమైనట్లు పరిశీలనలో గుర్తించారు. లోక్‌సభ ఎన్నికలకు చాలా ముందుగా టికెట్లు కేటాయించడం వల్ల సరిగ్గా ఎన్నికల టైం వచ్చే సమయానికి పార్టీ క్యాడర్ డీలా పడిందని పేర్కొన్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పలువురు బీజేపీ నేతలు చేసిన కామెంట్లతో కొన్ని వర్గాలు బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేశాయని నివేదిక తెలిపింది.

త్వరలో 10 బైపోల్స్.. వాటిపైనే ఫోకస్

ఈ పరిణామాలతో గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ దాదాపు 8 శాతం ఓట్లను కోల్పోయిందని పేర్కొంది. 2019 ఎన్నికల్లో 62 ఎంపీ సీట్లను గెల్చుకున్న బీజేపీ.. ఈసారి 33 సీట్లకే పరిమితమైంది. ఇక ఇదే సమయంలో సమాజ్‌వాదీ పార్టీ లోక్‌సభ సీట్ల సంఖ్య 5 నుంచి 37కు పెరిగింది. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఓట్ల శాతం పెరిగింది. బీఎస్పీ మునుపటి కంటే చాలా డీలా పడింది. యూపీ బీజేపీ యూనిట్ సమర్పించిన నివేదికను పార్టీ పెద్దలు విశ్లేషించి దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి త్వరలో జరగబోయే 10 అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికలపై ఫోకస్ చేయాలని యూపీ బీజేపీ నేతలకు పార్టీ చీఫ్ జేపీ నడ్డా సూచించారు బైపోల్స్ ఫలితాల తర్వాత యూపీ బీజేపీలో నాయకత్వ మార్పు అంశంపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సన్నిహితుల వాదన ఇంకోలా ఉంది. టికెట్ల కేటాయింపు బీజేపీ హైకమాండ్ వైపు నుంచే జరిగిందని.. కొత్త అభ్యర్థులు పెద్దసంఖ్యలో పోటీ చేయడం వల్ల విజయావకాశాలు తగ్గాయని వారు వాదిస్తున్నారు. బీజేపీ వైఫల్యంలో సీఎం యోగి తప్పిదమేదీ లేదని వారు చెబుతున్నారు.

Advertisement

Next Story