ప్రధాని పదవికి రాహుల్ గాంధీ అన్ని విధాలా అర్హుడు : Mehbooba Mufti

by Vinod kumar |
ప్రధాని పదవికి రాహుల్ గాంధీ అన్ని విధాలా అర్హుడు : Mehbooba Mufti
X

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి పదవికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్ని విధాలా అర్హుడని జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. అధికారంలో ఉన్న వారి కంటే రాహుల్‌కు దేశం పట్ల మంచి విజన్ ఉందని, భారత దేశ ప్రయోజనాలను పరిరక్షించాలనే లక్ష్యం కలిగి ఉన్నారని చెప్పారు. ‘భారత దేశ ఆలోచనలను ప్రపంచం ముందు ఉంచడం రాహుల్‌కు వెన్నతో పెట్టిన విద్య. దేశం కోసం మహాత్మా గాంధీ ప్రాణాలు అర్పించారు. రాహుల్ ముత్తాత జైలుకు వెళ్లారు. ఆయన నానమ్మ, తండ్రి సైతం ప్రాణాలిచ్చారు. భారత దేశ ఆలోచనను ముందుకు తీసుకెళ్లలనే అభిరుచి ఉన్న నాయకుడు రాహుల్. ఒక ప్రధాన మంత్రిలో మీకు ఇంతకంటే ఏం కావాలి..?’ అని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్ మెహబూబా ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ‘ప్రధాని పదవికి అర్హత నిరక్షరాస్యతా..? గో రక్షకుల పేరుతో ప్రజలను కొట్టి చంపే వారికి అండగా నిలవడం తప్ప దేశం పట్ల దార్శనికత లేకపోవడమా..?’ అంటూ ప్రధాని మోడీని ఎద్దేవా చేశారు.

ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న ఈ గోరక్షకులు, ఇతర వ్యక్తుల కంటే రాహుల్ గాంధీకి దేశం పట్ల చాలా మంచి దృక్పథం ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. రాహుల్ ఉన్నత విద్యను అభ్యసించారని, అన్ని విషయాల గురించి లోతైన అవగాహన ఉందని కొనియాడారు. ‘ఇండియా’ కూటమిలో ప్రధాన మంత్రి పదవికి చాలా మంది పోటీదారులు ఉన్నారన్న విమర్శపై ముఫ్తీ స్పందిస్తూ.. ప్రధాని పదవికి బీజేపీలో ఒకరే అర్హులేమో.. ‘ఇండియా’ కూటమిలో మాత్రం నితీష్, మమతా బెనర్జీ, స్టాలిన్ వంటి చాలా మంది అర్హులు ఉన్నారని చెప్పారు. రాహుల్ ప్రధాని అవుతారా.. కాదా.. అనేది ప్రధానం కాదని, మతోన్మాదానికి వ్యతిరేకంగా దేశాన్ని సరైన మార్గంలో తీసుకెళ్లడానికి ‘ఇండియా’ కూటమి చేసే పోరాటానికి రాహుల్ నాయకత్వం వహిస్తారనడంలో సందేహం లేదన్నారు.

Advertisement

Next Story

Most Viewed