రాజకీయ నిరసనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలివీ..

by Hajipasha |   ( Updated:2024-02-19 18:33:17.0  )
రాజకీయ నిరసనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలివీ..
X

దిశ, నేషనల్ బ్యూరో : రాజకీయ పార్టీల నిరసనలను, సామాన్య పౌరుల నిరసనలను వేర్వేరుగా చూడలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం ప్రతీ ఒక్కరికీ సమానంగా లభిస్తుందని తేల్చి చెప్పింది. 2022 సంవత్సరంలో నాటి కర్ణాటక సీఎం, బీజేపీ సీనియర్ నేత బసవరాజ్‌ బొమ్మై ఇంటి ముట్టడికి బయలుదేరిన కాంగ్రెస్ సీనియర్ నేతలు సిద్ధరామయ్య, ఎంబీ పాటిల్‌, రామలింగారెడ్డి, రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై అప్పట్లో కేసులు కూడా బనాయించారు. నాటి కేసులను ఇటీవల విచారించిన కర్ణాటక హైకోర్టు ఆ నలుగురు కాంగ్రెస్ లీడర్లకు కూడా రూ.10వేలు చొప్పున జరిమానా విధించింది. మార్చి 6న సీఎం సిద్ధరామయ్య, 7న రవాణామంత్రి రామలింగారెడ్డి, 11న రణదీప్‌ సూర్జేవాలా, 15న మంత్రి ఎంబీ పాటిల్‌‌లను ప్రజాప్రతినిధుల కోర్టులో హాజరుకావాలని తెలిపింది. దీంతో కర్ణాటక హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య ఫిబ్రవరి 14న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను సోమవారం దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. కర్ణాటక ముఖ్యమంత్రి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ‘‘సిద్ధరామయ్య సహా కాంగ్రెస్ నేతలు ఆనాడు రాజకీయ నిరసన తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం నిర్వహించే రాజకీయ నిరసనలను ఎవరూ అడ్డుకోలేరు’’ అని అభిషేక్ మను సింఘ్వీ కోర్టుకు తెలిపారు. స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ‘’నిరసన ఎవరు తెలిపినా ఒక్కటే. రాజకీయ నాయకుల నిరసన, సామాన్య పౌరుల నిరసన రెండూ ఒక్కటే.. సామాన్యులు నిరసన తెలిపితే వదిలేస్తారా ? రాజకీయ నాయకులు నిరసన తెలిపితే అరెస్టు చేస్తారా ? చట్టం అందరికీ సమానమే కదా’’ అని వ్యాఖ్యానించింది. నాయకులపై కర్ణాటక హైకోర్టు విధించిన జరిమానా, కోర్టుకు హాజరు ఉత్తర్వులపై స్టే విధించింది. తదుపరి విచారణను ఆరువారాల తర్వాతకు వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed