ఎలక్టోరల్ బాండ్ల రద్దు : 5200 కోట్లకు ఏమేం అమ్మేశారు.. బీజేపీకి కాంగ్రెస్ ప్రశ్న

by Hajipasha |   ( Updated:2024-02-15 11:21:56.0  )
ఎలక్టోరల్ బాండ్ల రద్దు : 5200 కోట్లకు ఏమేం అమ్మేశారు.. బీజేపీకి కాంగ్రెస్ ప్రశ్న
X

దిశ, నేషనల్ బ్యూరో : ఎలక్టోరల్ బాండ్ల విక్రయాల ద్వారా రాజకీయ విరాళాలను సేకరించే పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో బీజేపీ లక్ష్యంగా కాంగ్రెస్ విరుచుకుపడింది. ఎలక్టోరల్ బాండ్ల జారీ ద్వారా అందుకున్న రూ.5200 కోట్లకు బదులుగా కేంద్రంలోని బీజేపీ సర్కారు ఏమేం విక్రయించిందో చెప్పాలని కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేరా ప్రశ్నించారు. ఎన్నికల సంఘం సమాచారం ప్రకారం.. 2022 వరకు బీజేపీకి లభించిన రూ.9,208 కోట్ల విరాళాల్లో రూ.5,270 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల విక్రయాల ద్వారా అందాయి. “మీరు విమానాశ్రయాలు, బొగ్గు గనులను అమ్మారా లేదంటే ఎమ్మెల్యేలను కొన్నారా? దీన్ని తెలుసుకునే హక్కు మాకు ఉంది” అని ఖేరా వ్యాఖ్యానించారు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ సహా అన్ని పార్టీలకు వచ్చిన విరాళాల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఎస్‌బీఐని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు నుంచి తమను తాము రక్షించుకోవడానికి మోడీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేస్తుందేమోననే ఆందోళనను ఖేరా వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం, ఆర్థిక శాఖ, న్యాయ శాఖ అధికారుల అభ్యంతరాలను పట్టించుకోకుండా ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని దేశంపై బలవంతంగా రుద్దారని ఆయన ఆరోపించారు.

Advertisement

Next Story