సంక్షేమ పథకాలు పేదలకు అందడం లేదు: కాంగ్రెస్ నేత చిదంబరం

by vinod kumar |
సంక్షేమ పథకాలు పేదలకు అందడం లేదు: కాంగ్రెస్ నేత చిదంబరం
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోని వివిధ సంక్షేమ పథకాలు, విధానాలు పేదలకు అందడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిదంబరం అన్నారు. ప్రభుత్వాలు తీసుకొచ్చే స్కీమ్స్ పేదల వైపు దృష్టి సారిస్తేనే సమ సమాజం ఏర్పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేరళలో మంగళవారం నిర్వహించిన ఎంపీ వీరేంద్ర కుమార్ స్మారక కార్యక్రమంలో ‘ఇన్‌క్లూజివ్ గ్రోత్: మైత్ అండ్ రియాలిటీ’ అనే అంశంపై ప్రసంగించారు. ఒకదానికొకటి ప్రతిబింబించే ఆర్థిక, సామాజిక సోపానక్రమాలను అర్థం చేసుకుని అణగారిన వర్గాల వైపు పాలసీలను మార్చకపోతే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. పూర్తిగా పెట్టుబడిదారీ, సంపన్న దేశాలు కూడా సమానత్వ సమాజాలను నిర్మించాయని వెల్లడించారు. వైద్యం, విద్యను విశ్వవ్యాప్తం చేయడం ద్వారా సమానత్వ సమాజాన్ని నిర్మించొచ్చని చెప్పారు. ఉజ్వల పథకం కింద ఉచితంగా అందించే గ్యాస్ సిలిండర్ల వల్ల లబ్ధి పొందేది మధ్యతరగతి ప్రజలే తప్ప పేదలు కాదని ఆరోపించారు. వీరేంద్ర కుమార్ జీవితకాల సామ్యవాది, పండితుడు, రచయిత అని కొనియాడారు. కాగా, వీరేంద్ర కుమార్1996 నుంచి 1998 వరకు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిత్వ శాఖలో పని చేశారు.

Advertisement

Next Story