- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Priyanka Gandhi: ప్రధాని మోడీకి ప్రియాంక గాంధీ లేఖ

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. గతేడాది కొండచరియలు విరిగిపడి వయనాడ్ ప్రజల జీవితాలను అతలాకుతలం చేసిన విషాదానికి సంబంధించి కేంద్రం ప్రకటించిన సహాయ ప్యాకేజీని గ్రాంట్‌గా మార్చాలని కోరారు. ప్రమాదం నుంచి కోలుకునేందుకు, తమ జీవితాలను పునర్నిర్మించుకోవడంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రధానికి వివరించారు. వయనాడ్ ప్రజలు ప్రభుత్వం అందించే ప్రతి సహాయానికి, మద్దతుకు అర్హులన్నారు. తన నియోజకవర్గంలో చూరల్‌మల, ముండక్కై ప్రజలు చూసిన భయంకరమైన విషాదం తమ జీవితాలను, జీవనోపాధిని నాశనం చేసిన ఆరు నెలల తర్వాత కూడా ఇంకా కష్టాల్లోనే ఉండటంపై ప్రియాంక గాంధీ విచారం వ్యక్తం చేశారు. గతేడాది జూలై 30న జరిగిన ఈ ప్రమాదంలో 298 మంది చనిపోగా, 32 మంది మరణించినవారి మృతదేహాలు కూడా లభించలేదు. మొత్తం 58 మందితో కూడిన 17 కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయని లేఖలో వివరించారు. 1,685 భవనాలు దెబ్బతిన్నాయని, వాటిలో ఇళ్లు, స్కూళ్లు, గ్రామ కార్యాలయాలు, డిస్పెన్సరీలు, అంగన్వాడీలు, ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. కొండచరియలు విరిగిపడటంతో 110 ఎకరాల వ్యవసాయ భూమి ధ్వంసమైంది. ఈ ప్రాంతంలో టీ, కాఫీ, ఏలకులు ప్రధాన పంటలుగా ఉండేవి. పర్యాటక కార్యకలాపాలతో ఆదాయం పొందిన చాలామంది జీవనోపాధి లేకుండా పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో వయనాడ్ జిల్లాకు కేంద్రం నుంచి అవసరమైన సాయం కావాలి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం నుంచి ఆర్థిక, మౌలిక సదుపాయాల మద్దతు లేకుండా ప్రజలు ఈ విపత్తును అధిగమించడం సాధ్యం కాదు. కాగా, కేరళ ఎంపీల డిమాండ్ల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బాధితుల కోసం 529.50 కోట్ల సహాయ ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, షరతులతో కూడిన ఉపశమన ప్యాకేజీని ప్రకటించడం చాలా నిరాశపరిచిందని ప్రియాంక గాంధీ అన్నారు.