Wayanad : వయనాడ్‌కు ‘రిలీఫ్ ఫండ్’ నిధులు ఇచ్చేదెప్పుడు.. కేంద్రానికి హైకోర్టు ప్రశ్న

by Hajipasha |
Wayanad : వయనాడ్‌కు ‘రిలీఫ్ ఫండ్’ నిధులు ఇచ్చేదెప్పుడు.. కేంద్రానికి హైకోర్టు ప్రశ్న
X

దిశ, నేషనల్ బ్యూరో : కొండచరియలు విరిగిపడటంతో జులై 30న అతలాకుతలమైన వయనాడ్‌‌కు ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వ సహాయక నిధులు అందకపోవడంపై కేరళ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. జాతీయ విపత్తు ఉపశమన నిధి (ఎన్‌డీఆర్ఎఫ్), ప్రధానమంత్రి ఉపశమన నిధి (పీఎంఆర్ఎఫ్) నుంచి కేరళ రాష్ట్రానికి ఇంకా సాయం ఎందుకు అందలేదని న్యాయమూర్తులు జస్టిస్ ఎ.కె.జయశంకరన్ నంబియార్, జస్టిస్ శ్యామ్ కుమార్ వి.ఎంలతో కూడిన ధర్మాసనం కేంద్ర సర్కారును ప్రశ్నించింది.

వయనాడ్‌లాగే ప్రకృతి విపత్తులను ఎదుర్కొన్న తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాలకు ఇప్పటికే కేంద్రం నిధులను విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేసింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. స్పందించేందుకు కొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఈనెల 18లోగా సమగ్ర వివరణను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ)లను హైకోర్టు ఆదేశించింది. వయనాడ్‌కు సహాయక నిధులను త్వరితగతిన విడుదల చేయాలని నిర్దేశించింది.

Advertisement

Next Story

Most Viewed