Wayanad landslide: 276కు చేరిన వయనాడ్ ప్రమాద ఘటన మృతుల సంఖ్య

by Harish |
Wayanad landslide: 276కు చేరిన వయనాడ్ ప్రమాద ఘటన మృతుల సంఖ్య
X

దిశ, నేషనల్ బ్యూరో: కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో క్రమంగా మరణాల సంఖ్య పెరుగుతుంది. గురువారం ఉదయం నాటికి మొత్తం మరణించిన వారి సంఖ్య 276కి చేరింది. ఇంకా 240 మంది గల్లంతైనట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధృవీకరించారు. 1,500 మందికి పైగా ప్రభావిత ప్రాంతాల నుండి రక్షించబడ్డారు. రెస్క్యూ సిబ్బంది 24 గంటలు సెర్చ్ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నారు. శిథిలాలు తొలగిస్తున్న కొద్ది మరణాల సంఖ్య ఇంకా పెరుగుతుంది. శిథిలాలలో లభించిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రుల మార్చురీలకు తరలిస్తున్నారు.

చాలా మృతదేహాలు బురదలో కురుకుపోవడంతో వాటిని బయటకు తీయడం కష్టంగా ఉంది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు వేగవంతం చేయడానికి సైన్యం ముండక్కై వద్ద బెయిలీ వంతెనను నిర్మించింది. వాయనాడ్‌లో 45 సహాయ శిబిరాలను ఏర్పాటు చేశామని, 3,000 మందికి పైగా నిరాశ్రయులైన వ్యక్తులకు ఆశ్రయం కల్పించామని సీఎం విజయన్ తెలిపారు. గురువారం సీఎం విజయన్ ఈ ఘటనపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. జిల్లాలో ఉన్న రాష్ట్ర మంత్రులు, వాయనాడ్ ఎమ్మెల్యేలు, రాజకీయ పార్టీల నేతలు ఈ సమావేశానికి హాజరవుతారని జిల్లా యంత్రాంగం తెలిపింది.

కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ, తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి బాధిత ప్రాంతాల్లోని సహాయక శిబిరాలను సందర్శించడానికి బయలుదేరారు. మరోవైపు వయనాడ్‌తో సహ మరికొన్ని జిల్లాలకు భారత వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇడుక్కి, త్రిస్సూర్, పాలక్కాడ్, కన్నూర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్, పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో శనివారం వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

Next Story