Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం

by Shamantha N |
Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం
X

దిశ, నేషనల్ బ్యూరో: వక్ఫ్‌ సవరణ బిల్లు(Waqf (Amendment) Bill) పరిశీలన కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ సంయుక్త కమిటీ (JPC) పలు ఎన్డీఏ సభ్యులు ప్రతిపాదించిన సవరణలకు ఆమోదం తెలిపింది. విపక్ష ఎంపీలు సహా ఇతరులు మొత్తంగా 44 మార్పులు సూచించగా.. 14 సవరణలను కమిటీ ఆమోదించినట్లు ప్యానెల్‌ ఛైర్మన్‌ జగదాంబిక పాల్‌ తెలిపారు. ఈ సవరణలు చట్టాన్ని మరింత శక్తివంతంగా మారుస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. క్లాజుల వారీగా ఓటింగ్‌లో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 16 మంది ఎంపీలు సవరణలకు అనుకూలంగా ఓటు వేయగా.. 10 మంది ప్రతిపక్ష సభ్యులు వాటికి వ్యతిరేకంగా ఓటు వేశారు. మొత్తం 44 నిబంధనలను కలిగి సవరణ బిల్లు 16:10 మెజారిటీతో నెగ్గింది.

విపక్షాల విమర్శలు

కమిటీలో ఎన్డీయే సభ్యులు సూచించిన మార్పులకు ఆమోదం లభించగా.. విపక్షాలు సూచించిన మార్పులు తిరస్కరణకు గురయ్యాయి. వీటిపై ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో కమిటీ పనిచేయలేదని విపక్ష సభ్యులు ఆరోపించారు. "ఇది ఒక హాస్యాస్పదమైన ఓటింగ్ ప్రక్రియ. మా మాట వినలేదు. కమిటీ ఛైర్మన్ పాల్ నియంతృత్వంగా వ్యవహరించారు" అని టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మండిపడ్డారు. కాగా.. కమిటీ ఛైర్మన్ పాల్ మాత్రం కల్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలను ఖండించారు. ఓటింగ్ ప్రక్రియ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందని.. మెజారిటీ అభిప్రాయాన్ని తీసుకున్నట్లు వివరించారు. ఇకపోతే, జనవరి 28 నాటికి ముసాయిదా నివేదిక రెడీ కాగా.. జనవరి 31న తుది నివేదిక లోక్‌సభకు అందజేయనున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. అయితే, వక్ఫ్ సవరణ బిల్లుని గతేడాది ఆగస్టు 8న కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కాగా.. ఆ బిల్లు వివరణాత్మక పరిశీలన కోసం జేపీసీకి పంపారు.

Next Story

Most Viewed