Vice president: రాజ్యాంగంపై అవగాహన అవసరం.. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్

by vinod kumar |
Vice president: రాజ్యాంగంపై అవగాహన అవసరం.. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండటం ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరమని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అభిప్రాయపడ్డారు. కొంత మంది దాని విలువలను మర్చిపోయారని ఇది ఎంతో దురదృష్టకరమని తెలిపారు. ఆదివారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రిజర్వేషన్‌ను అంతం చేయడంపై ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ వ్యతిరేక మనస్తత్వాన్ని సూచిస్తున్నాయన్నారు. భారత దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడడం, రాజ్యాంగాన్ని గౌరవించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. కానీ భారత రాజ్యాంగాన్ని బహిరంగంగా అగౌరవపరిచేలా విదేశీ పర్యటన చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

రాజ్యాంగాన్ని పుస్తకంలాగా చూపించడం కాదని, దానిని చదివి అర్థం చేసుకోవాలన్నారు. రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలను ఏ ఒక్కరూ అంగీకరించబోరని స్పష్టం చేశారు. ‘రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి విదేశీ గడ్డపై వరుసగా, భారత వ్యతిరేక నినాదాలు చేస్తున్నాడు. ఈ చర్యలు మన మాతృభూమిని బాధపెడతాయి. ఈ తరహా వ్యాఖ్యలను తిప్పికొట్టాలి’ అని యువతకు పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని, దాని విలువలను అగౌరవపరిచే శక్తులపై పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎమర్జెన్సీ విధించడం ద్వారా ఇందిరాగాంధీ ప్రజలపైనా, వారి హక్కులపైనా దాడి చేశారని గుర్తు చేశారు. ఆ 21 నెలల్లో మన దేశం చాలా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story