LK Advani: అస్వస్థతకు గురైన ఎల్‌కే అడ్వానీ

by S Gopi |
LK Advani: అస్వస్థతకు గురైన ఎల్‌కే అడ్వానీ
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అడ్వాణీ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఆయనను ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. నెలరోజుల క్రితమే అడ్వానీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 96 ఏళ్ల బీజేపీ నేత జూలై 3న సరితా విహార్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అంతకుముందు జూన్‌లోనూ అనారోగ్యం కారణంగా ఎయిమ్స్‌లో చికిత్స పొందారు. గతకొంతకాలంగా ఆయన వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. 2002-2004 మధ్య అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో అద్వానీ ఉప-ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ ఏడాది మార్చిలో ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా భారత రత్న పురస్కరాన్ని అందుకున్నారు. 1927, నవంబర్ 8న కరాచీ (ప్రస్తుత పాకిస్థాన్)లో జన్మించిన అడ్వానీ 1942లో స్వయంసేవక్‌గా ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. 1986 నుంచి 1990 వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా, 1993 నుంచి 1998 వరకు, 2004 నుంచి 2005 వరకు అడ్వానీ పనిచేశారు. 1980లో పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి అత్యధిక కాలం పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. దాదాపు మూడు దశాబ్దాల పార్లమెంటరీ కెరీర్‌ను ముగించి, ఎల్‌కె అడ్వానీ మొదట హోం మంత్రిగా, తరువాత అటల్ బిహారీ వాజ్‌పేయి (1999-2004) కేబినెట్‌లో ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు.

Advertisement

Next Story

Most Viewed