చీనాబ్ రైల్వే వంతెనపై తొలిసారి పరుగులు పెట్టిన వందేభారత్.. వీడియో వైరల్

by D.Reddy |
చీనాబ్ రైల్వే వంతెనపై తొలిసారి పరుగులు పెట్టిన వందేభారత్.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూకశ్మీర్‌లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చీనాబ్‌ రైల్వే వంతెన(Chenab Rail Bridge)పై మరో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ చారిత్రక వంతెనపై తొలిసారి శనివారం రోజున వందే భారత్‌ రైలు(Vande Bharat Train) పరుగులు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో భారత రైల్వే శాఖ షేర్ చేయగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కాత్రాలోని శ్రీ మాతా వైష్ణోదేవి రైల్వేస్టేషన్‌ నుంచి శ్రీనగర్‌ వరకు సెమీ హైస్పీడ్ వందేభారత్‌ రైలు ఫస్ట్‌ ట్రయల్‌ రన్స్‌ రైల్వే అధికారులు నిర్వహించారు. ఈ మార్గమధ్యలోనే చీనాబ్ నది ఉండటంతో రైల్వే వంతెనపై వందే భారత్‌ రైలు పరుగులు పెట్టింది. కాగా, ఇప్పటికే సెమీ హైస్పీడ్‌ వందే భారత్‌ రైళ్లు దేశ వ్యాప్తంగా పలు మార్గాల్లో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. అయితే, కాశ్మీరు లోయలోని కఠినమైన శీతల వాతావరణాన్ని తట్టుకునే లాగా ఈ రైలు రూపొందించబడింది. నీరు గడ్డ కట్టకుండా ఉంచేలా అత్యాధునిక హీటింగ్‌ వ్యవస్థలను ఇందులో ఏర్పాటుచేశారు. ట్రయల్ రన్ పూర్తి చేసుకున్న ఈ రైలు త్వరలోనే తన సేవలను అందించనుంది.

కశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు మొత్తం 272 కిలోమీటర్ల మేర ఉధంపుర్‌-శ్రీనగర్‌-బారాముల్లా రైల్వే ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ దాదాపు పూర్తైంది. కత్రా, రిసియా మధ్య కొంత మేర పెండింగ్‌లో ఉంది. ఈ ప్రాజెక్ట్‌ పూర్తయ్యాక రైళ్లు రియాసి జిల్లాలోని అంజి వంతెన, చీనాబ్‌ వంతెన ద్వారా ఉధంపూర్‌, జమ్ము, కాట్రా గుండా వెళతాయి. సంగల్దాన్‌, బనిహాల్‌ మీదుగా నేరుగా శ్రీనగర్‌, బారాముల్లా చేరుకుంటాయి. దీంతో రోడ్డు మార్గంతో పోలిస్తే ఆరు గంటలు ఆదా అవుతుంది.

చీనాబ్ రైలు వంతెనను భారతీయ రైల్వే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఉక్కు, కాంక్రీట్‌తో నిర్మించిన ఈ వంతెన జమ్మూ కశ్మీర్‌లోని జమ్మూ డివిజన్ రియాసి జిల్లా బక్కల్ – కౌరీ మధ్య ఉంది.నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తునున్న ఈ రైల్వే వంతెన పొడవు 1,315 మీటర్లు. ఇప్పటివరకూ చైనాలోని బెయిపాన్‌ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్‌ రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. పారిస్‌లోని ప్రఖ్యాత ఐఫిల్‌ టవర్‌తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండటం విశేషం.

Next Story

Most Viewed