US elections: సుంకాల విషయంలో మరోసారి భారత్ గురించి ప్రస్తావించిన ట్రంప్

by Shamantha N |
US elections: సుంకాల విషయంలో మరోసారి భారత్ గురించి ప్రస్తావించిన ట్రంప్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా ఎన్నికలు దగ్గరపడటంతో.. అభ్యర్థుల ప్రచారాలు జోరందుకున్నాయి. అమెరికా(USA) అధ్యక్ష బరిలో ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. ఓ ఇంటర్వ్యూలో మరోసారి సుంకాల అంశాన్ని తెరపైకి తెచ్చారు. తాను అధికారంలోకి వస్తే పలు దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై పన్ను విధిస్తానని నొక్కి చెప్పారు. టారిఫ్ అనేది డిక్షనరీలో ఉన్న చాలా అందమైన పదం అని అన్నారు. అమెరికాలోని కంపెనీలు వృద్ధిచెందేందుకు టారిఫ్‌లు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ‘‘అమెరికాను వాడుకుని శత్రు దేశాల కంటే మిత్రదేశాలే ఎక్కువ లాభం పొందుతున్నాయి. మిత్రపక్షమైన ఈయూతో మనకు 300 బిలియన్‌ డాలర్ల వాణిజ్య లోటు ఉంది. అమెరికా వాణిజ్య ఒప్పందాలు సరిగా లేవు. తెలివితక్కువ తనం లేదా డబ్బు పొందాలనే ఉద్దేశంతో ఇలాంటి ఒప్పందాలు చేసుకున్నారు’’ అంటూ పరోక్షంగా బైడెన్‌ ప్రభుత్వాన్ని ట్రంప్ విమర్శించారు.

మరోసారి భారత్ ప్రస్తావన

తాను అధికారంలో ఉన్నప్పటి విషయాల గురించి ట్రంప్ ప్రస్తావించారు. ‘‘నేను అధికారంలో ఉన్నప్పుడు చైనాపై 27.5శాతం టారిఫ్‌లు విధించా. అలా చేయకుంటే ఇప్పుడు అమెరికా అంతా చైనా కార్లే ఉండేవి. అదే జరిగితే మన దేశంలోని ఫ్యాక్టరీలన్నీ మూతబడేవి. ఆటోరంగంలో ఉద్యోగాల కొరత ఉండేది’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. టారిఫ్ ల విషయంలో మరోసారి భారత్ గురించి ప్రస్తావించారు. సుంకాల విషయంలో భారత్ కఠినంగా ఉంటోందని అన్నారు. గతంలోనూ టారిఫ్ ల గురించి భారత్ ని విమర్శిస్తూనే ప్రధాని మోడీని ప్రశంసించారు.

Advertisement

Next Story

Most Viewed