ఢిల్లీలో సేవల నియంత్రణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

by Vinod kumar |
ఢిల్లీలో సేవల నియంత్రణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
X

న్యూఢిల్లీ: ఢిల్లీలో సేవల నియంత్రణపై కేంద్రం ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును ప్రవేశ పెట్టేందుకు కేంద్ర మంత్రి వర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. అధికారుల బదిలీ, పోస్టింగ్‌లతో సహా సేవా వ్యవహారాల్లో ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఇచ్చిన అధికారాన్ని రద్దు చేస్తూ.. ఆ అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం సొంతం చేసుకుంటూ మే 19వ తేదీన ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇప్పుడు ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు తీసుకొస్తే ఢిల్లీ ప్రభుత్వ ఉన్నతాధికారులపై లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాన్ని సుస్థిరం చేస్తుంది.

ప్రభుత్వ నిర్ణయాలు, నియామకాలు, బదిలీలపై లెఫ్టినెంట్ గవర్నర్‌కు అభ్యంతరాలుంటే ఫైల్‌ను తిరిగి పంపించే అధికారం లభిస్తుంది. కేంద్రం తీసుకొచ్చే బిల్లు చట్ట రూపం దాలిస్తే ఢిల్లీతో పాటు అండమాన్ నికోబార్, లక్షద్వీప్, డయ్యూ డామన్, దాద్రా నగర్ హవేలి కేంద్రపాలిత ప్రాంతాల్లో గ్రూప్-ఎ అధికారుల బదిలీ, క్రమశిక్షణా చర్యల కోసం జాతీయ స్థాయిలో సివిల్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కేంద్రం ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేసింది. సేవలపై నియంత్రణను తొలగించేందుకు చట్టం చేయడం ద్వారా పాలనపై ఢిల్లీ ప్రభుత్వ అధికారాన్ని పార్లమెంటు రద్దు చేయగలదా.. అనే విషయాన్ని ధర్మాసనం పరిశీలిస్తుందని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed