ఈ విధ్వంసాన్ని ఆపాలి.. ఇజ్రాయెల్ కు యూఎన్ వార్నింగ్

by Shamantha N |   ( Updated:2024-05-28 07:02:49.0  )
ఈ విధ్వంసాన్ని ఆపాలి.. ఇజ్రాయెల్ కు యూఎన్ వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: రఫాపై ఇజ్రాయెల్ దాడిపై ప్రపంచ దేశాల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఇజ్రాయెల్ దాడిలో 45 మంది చనిపోయారు. ఐక్యరాజ్యసమితి ఇజ్రాయెల్ చర్యలపై తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ విధ్వంసాన్ని ఆపాలని ఇజ్రాయెల్ కు ఐక్యరాజ్యసమితి వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్ దాడిని సామాన్యులపై జరిగిన ఘోరం అని ఐక్యరాజ్యసమితి అభివర్ణించింది. ఇజ్రాయెల్ చర్యలను ఖండిస్తున్నామని ప్రకటించింది. గాజాలో అసలు సురక్షితమైన ప్రాంతమే లేదని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా యూఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటారెస్ తెలిపారు. ఈ విధ్వంసాన్ని వెంటనే ఆపాలని ఇజ్రాయెల్ ను కోరారు.

రఫాలో ఆదివారం రాత్రి ఇజ్రాయెల్‌ దారుణమైన దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 45 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. 200 మందికిపైగా గాయపడ్డారు. ఈ దాడిని భీకర దాడి అని ప్రపంచ దేశాలు పేర్కొన్నాయి.దాడి జరిగిన తల్‌ అల్‌ సుల్తాన్‌ ప్రాంతాన్ని సురక్షితమైనదిగా ఇజ్రాయెలే ప్రకటించింది. దీంతో చాలా మంది ఇక్కడకు వచ్చి తలదాచుకుంటున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతంపైనే దాడి చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. దాడి గురించి చూస్తే.. ఇజ్రాయెల్ తీరులో మార్పు రాలేదని తెలుస్తోంది అని యూఎన్ మానవ హక్కుల విభాగం హై కమిషనర్ వోల్కర్ టర్క్ అన్నారు. అసలు గాజాలో సురక్షితమైన ప్రాంతమే లేదన్నారు. సామాన్యులు ఉన్న అళాంటి ప్రాంతంపై దాడి చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఇజ్రాయెల్ కు తెలుసన్నారు. కాల్పుల విరమణను పాటించాలని రెండు దేశాలకు సూచించారు. ఖైదీలుగా ఉన్నవారిని వెంటనే విడుదల చేయాలన్నారు.

Advertisement

Next Story