మళ్లీ గెలిస్తే యువతకు 'నేషనల్ సర్వీస్' అవకాశం: యూకే ప్రధాని రిషి సునాక్

by S Gopi |
మళ్లీ గెలిస్తే యువతకు నేషనల్ సర్వీస్ అవకాశం: యూకే ప్రధాని రిషి సునాక్
X

దిశ, నేషనల్ బ్యూరో: యూకేలో జూలై 4న జరిగే ఎన్నికల్లో కంజర్వేటివ్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే పద్దెనిమిదేళ్ల యువత నేషనల్ సర్వీస్‌ను తప్పనిసరి చేయనున్నట్టు ప్రధానమంత్రి రిషి సునాక్ ప్రకటించారు. దేశంలో తమకు తగిన అవకాశాలు లభించట్లేదని భావిస్తున్న యువతకు ఈ నిర్ణయం పెరుగుతున్న ప్రపంచ అనిశ్చితిని అధిగమించేందుకు సహాయపడుతుందని రిషి సునాక్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధాని ప్రణాళిక ప్రకారం.. యువకులు 12 నెలల పాటు సాయుధ దళాల్లో పూర్తిస్థాయి ప్లేస్‌మెంట్ లేదా స్వచ్ఛందంగా ఏడాది పాటు నెలలో ఒక వీకెండ్ పనిచేసేలా ఎంచుకోవచ్చని వెల్లడించారు. ఈ రకమైన పథకం గతంలో 1947-1960 మధ్య కూడా యూకేలో అమలు చేశారు. అప్పట్లో 17-21 ఏళ్ల మధ్య వయసున్న పురుషులు 18 నెలల పాటు సాయుధ దళాల్లో పనిచేసేవారు. బ్రిటీష్ సైన్యం 2010లో లక్షల నుంచి 2024, జనవరి నాటికి 73,000కి తగ్గింది. తాజాగా నిర్ణయం ఈ లోటును తీర్చగలదు. సాయుధ దళాల్లో ప్లేస్‌మెంట్ ద్వారా యువత లాజిస్టిక్స్, సైబర్ సెక్యూరిటీ, ప్రొక్యూర్‌మెంట్, సివిల్ రెస్పాన్స్ ఆపరేషన్స్‌లో శిక్షణ, పాల్గొనేందుకు సహాయపడుతుందని కంజర్వేటివ్ పార్టీ చెబుతోంది. అలాగే, నేషనల్ సర్వీస్‌లో భాగంగా అగ్నిమాపక, పోలీస్, యూకే నేషనల్ హెల్త్ సర్వీస్, వృద్ధులు, ఒంటరిగా ఉన్నవారికి సాయం వంటి ఎంపికలు ఉన్నాయి.ఈ కార్యక్రమానికి ఏటా సుమారు 2.5 బిలియన్ పౌండ్లు ఖర్చవుతుందని బీబీసీ అంచనా వేసింది. ఈ కార్యక్రమ మొదటి పైలట్ ప్రాజెక్టు కోసం 2025, సెప్టెంబర్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed