10 రోజుల్లో ఎంబీఏ.. నకిలీ కోర్సులపై యూజీసీ హెచ్చరిక

by S Gopi |
10 రోజుల్లో ఎంబీఏ.. నకిలీ కోర్సులపై యూజీసీ హెచ్చరిక
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆన్‌లైన్ నకిలీ కోర్సులపై యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కీలక హెచ్చరికలు జారీ చేసింది. విద్యార్థులను ఆకర్షించేందుకు 10 రోజుల్లోనే ఎంబీయే అంటూ కోర్సుల పేరుతో జరుగుతున్న ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దేశంలో ఉన్న ఉన్నత విద్యాసంస్థల్లో గుర్తింపు పొందిన డిగ్రీ ప్రోగ్రామ్‌ల తరహాలోనే సంక్షిప్త పదాలతో ఆన్‌లైన్ కోర్సులు, ప్రోగ్రామ్‌లను అందిస్తున్నట్టు కొందరు వ్యక్తులు, సంస్థలు తప్పుదోవ పట్టిస్తున్నాయని, అందులో 10 రోజుల్లో ఎంబీయే అనేది కూడా ఒకటని యూజీసీ కార్యదర్శి మనీష్ జోషీ అన్నారు. కేంద్ర చట్టం లేదా ప్రాంతీయ, రాష్ట్ర చట్టం ద్వారా ఏర్పాటైన లేదా విలీనమైన యూనివర్శిటీ, డీమ్డ్ ఇన్‌స్టిట్యూట్ లేదా పార్లమెంటు చట్టం కింద ప్రత్యేక అధికారం కలిగిన సంస్థలకు మాత్రమే డిగ్రీ ఇచ్చే అర్హత ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఉన్నత విద్యాసంస్థలు ఏదైనా ఆన్‌లైన్ డిగ్రీ అందించాలనుకుంటే యూజీసీ అనుమతి తప్పనిసరి అని, ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లను అందించే అనుమతి ఉన్న ఉన్నత విద్యాసంస్థలు, వాటి ప్రోగ్రామ్‌ల జాబితా deb.ugc.ac.in లింక్‌లో అందుబాటులో ఉన్నాయని మనీష్ జోషి వివరించారు. కాబట్టి నకిలీ ఆన్‌లైన్ కోర్సుల విషయం ముందుగా నిర్ధారించుకోవడం ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Next Story