యూజీసీ - నెట్‌ పరీక్ష రద్దు.. కారణం అదే

by Hajipasha |
యూజీసీ - నెట్‌ పరీక్ష రద్దు.. కారణం అదే
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశంలోని కీలకమైన జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సంచలన నిర్ణయం తీసుకుంది. మంగళవారం రోజు (జూన్‌ 18న) నిర్వహించిన ‘యూజీసీ - నెట్‌ 2024’ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని, దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే అనౌన్స్ చేస్తామని వెల్లడించింది. ‘‘జూన్ 18న జరిగిన యూజీసీ - నెట్ పరీక్షపై బుధవారం రోజు మాకు హోంశాఖకు చెందిన నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ నుంచి కీలక సమాచారం అందింది. దాని ఆధారంగా యూజీసీ-నెట్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయనే నిర్ధారణకు మేం వచ్చాం. అందుకే ఆ పరీక్షను రద్దు చేశాం’’ అని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది.

యూజీసీ- నెట్ పరీక్షల్లో అవకతవకలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించే బాధ్యతను సీబీఐకి అప్పగిస్తామని తేల్చి చెప్పింది. ఈ ఎగ్జామ్స్‌లో పారదర్శకత, ప్రమాణాలు, సమగ్రతలను కాపాడటం కోసమే ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని విద్యాశాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా 1,205 సెంటర్లలో జరిగిన యూజీసీ - నెట్ పరీక్షకు దాదాపు 9లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. కాగా, నీట్ పేపర్ లీకేజీపై వస్తున్న ఆరోపణలపైనా కేంద్ర సర్కారు స్పందించింది. గ్రేస్‌ మార్కులు రద్దు చేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. బిహార్‌లో జరిగిన నీట్‌ పరీక్షల్లో చోటుచేసుకున్న అవకతవకలపై పోలీసులు విచారణ చేస్తున్నారని కేంద్రం తెలిపింది. ప్రాథమిక ఆధారాల మేరకు నీట్‌లో అవకతవకలు జరిగినట్టు నిర్థరణకు వచ్చామని, బిహార్‌ ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed