పైలట్ల అనూహ్య మరణాలు.. రెండు రోజుల్లో ఇద్దరు భారత పైలట్ల మృతి

by Vinod kumar |   ( Updated:2023-08-17 16:44:43.0  )
పైలట్ల అనూహ్య మరణాలు.. రెండు రోజుల్లో ఇద్దరు భారత పైలట్ల మృతి
X

న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చే పైలట్లు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోతున్నారు. భారత్‌లో రెండు రోజుల్లోనే ఇద్దరు పైలట్లు అకస్మాత్తుగా మృతి చెందడం విశేషం. గురువారం నాగ్‌పూర్‌లోని బోర్డింగ్ గేట్ వద్ద ఇండిగో విమానం కెప్టెన్ స్పృహ తప్పి పడిపోయాడు. నాగ్‌పూర్ నుంచి పూణేకు విమానాన్ని నడపాల్సి ఉన్న ఇండిగో విమానం కెప్టెన్ ఛాతీ నొప్పితో బోర్డింగ్ గేట్ వద్దే కుప్పకూలాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు ప్రకటించారు.

ఈ పైలట్ బుధవారం తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 7 గంటల మధ్య త్రివేండ్రం నుంచి నాగ్‌పూర్ వయా పూణే వరకు విమానాన్ని రెండు సెక్టార్‌లు నడిపినట్లు అధికారులు తెలిపారు. 27 గంటల విశ్రాంతి తీసుకున్న తర్వాత కెప్టెన్ గురువారం నాలుగు సెక్టార్లలో ప్రయాణించాల్సి ఉంది. అతడు స్పృహ తప్పి పడిపోయినప్పుడు మధ్యాహ్నం ఒంటి గంటకు తన మొదటి విమాన ప్రయాణం కోసం సిద్ధమవుతున్నాడు. పైలట్ మృతి పట్ల ఇండిగో సంస్థ సంతాప ప్రకటన విడుదల చేసింది.

మరో ఘటనలో బుధవారం ఖతార్ ఎయిర్‌వేస్ పైలట్ విమానంలోనే గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. ఢిల్లీ నుంచి దోహా వెళ్లిన విమానంలో అదనపు సిబ్బందిగా ప్రయాణికుల క్యాబిన్‌లో కూర్చున్న పైలట్ అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించాడు. అతడు ఇంతకు ముందు స్పైస్ జెట్, అలయన్స్ ఎయిర్, సహారా సంస్థల్లో పైలట్‌గా విధులు నిర్వహించాడు. ఈ ఇద్దరి మరణాలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ధ్రువీకరించింది. కొద్ది రోజుల క్రితమే మరో పైలట్ బాత్రూంలో కుప్పకూలి చనిపోయాడు. 271 మంది ప్రయాణికులతో మియామి నుంచి చిలీకి వెళ్లిన వాణిజ్య విమానంలో ఈ ఘటన జరిగింది. ఆదివారం రాత్రి పనామాలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయగా.. కెప్టెన్ ఇవాన్ అండౌర్ చనిపోయినట్లు విమానాశ్రయం వైద్య నిపుణులు ధ్రువీకరించారు.

Advertisement

Next Story

Most Viewed