నీట్ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్.. కీలక నిందితుడు అతడే!

by vinod kumar |
నీట్ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్.. కీలక నిందితుడు అతడే!
X

దిశ, నేషనల్ బ్యూరో: నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ మరో ఇద్దరిని మంగళవారం అరెస్ట్ చేసింది. బిహార్‌లోని పాట్నాకు చెందిన పంకజ్‌ కుమార్ అలియాస్ ఆదిత్య, జార్ఖండ్‌లోని హజారీబాగ్‌కు చెందిన రాజ్‌కుమార్ సింగ్ అలియాస్ రాజును అదుపులోకి తీసుకుంది. అయితే పంకజ్‌కుమార్‌ హజారీబాగ్ లోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ట్రంక్ పెట్టెల నుంచి నీట్ పేపర్‌ను దొంగిలించినట్టు సీబీఐ భావిస్తోంది. అలాగే పంకజ్‌కు రాజ్ కుమార్ సహకరించినట్టు తెలుస్తోంది. పేపర్ చోరీ అనంతరం పంకజ్ దానిని రాజుకు అందజేయగా ఆయన అభ్యర్థులకు పంపిణీ చేసినట్టు ఆరోపణలున్నాయి. అంతకుముందు హజారీ బాగ్‌లోని ఒయాసిస్ పాఠశాలలో పేపర్ లీక్ అయిందని, అక్కడకు చేరిన రెండు సెట్ల పేపర్ల సీలు విరిగిపోయాయని సీబీఐ విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే మరింత దర్యాప్తు చేపట్టిన సీబీఐ తాజాగా వీరిద్దరినీ అరెస్టు చేసింది. దీంతో పేపర్​ లీక్​ కేసులో అరెస్టైన వారి సంఖ్య 14కు చేరింది. హజారీబాగ్‌లో నీట్ పేపర్లు చోరీకి గురైన ట్రంక్ వీడియోను కూడా సీబీఐ విడుదల చేసింది. కాగా, ఈ ఏడాది మే 5న జరిగిన నీట్ పరీక్షలో పేపర్ లీక్ అవకతవకలు జరిగినట్టు ఆరోపణల వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story