అధిక డబ్బు ఆశ చూపి జనాలకు కుచ్చుటోపీ..

by Aamani |
అధిక డబ్బు ఆశ చూపి జనాలకు కుచ్చుటోపీ..
X

దిశ,శేరిలింగంపల్లి : తక్కువ పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఇస్తామంటూ జనాలకు భారీ ఎత్తున కుచ్చుటోపీ పెట్టింది మరో సంస్థ. వేల కోట్లలో స్కాంకు పాల్పడిన కంపెనీ నిర్వాహకులు పత్తా లేకుండా పోయారు. హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ఈ స్కాంలో దాదాపు 20 వేల మంది నుంచి దాదాపు సుమారు రూ.7000 కోట్ల మోసానికి పాల్పడ్డారు డీబీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ నిర్వాహకులు. ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన బాధితులు తాజాగా సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదుతో సైబరాబాద్ ఎకనామికల్ ఎఫైర్స్ వింగ్ (ఈఓ డబ్ల్యూ) లో కేసు నమోదు చేశారు.

అధిక లాభాలు ఆశ చూపి తమను మోసం చేశారని బాధితులు వాపోతున్నారు. వారి ఫిర్యాదు మేరకు డీబీ స్ట్రాక్ బ్రోకింగ్ చైర్మన్ దీపాంకర్ బర్మన్‌తో పాటు పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ సంస్థ హైదరాబాద్ తో మెట్రో నగరాలైన ముంబై, బెంగళూరు, కోల్ కతా, గౌహతిలో ఢిల్లీలో కేసులు నమోదయ్యాయి. స్టాక్ బ్రోకింగ్ లో వేలాదిమంది నుండి భారీగా పెట్టుబడులు పెట్టించి డబ్బులు చెల్లించకుండా మోసాలకు పాల్పడినట్టు బాధితులు ఈఓడబ్ల్యూకు ఇచ్చిన తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. డీబీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ బాధితులు హైదరాబాద్ లోనే 20 వేల మంది బాధితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

స్కామ్ వెలుగులోకి వచ్చింది ఇలా..

హైదరాబాద్ మణికొండ ప్రాంతానికి చెందిన 37 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగి షమై పంచాక్షర్ గత నెల 23న పోలీసులను ఆశ్రయించాడు. డీబీ స్టాక్ బ్రోకింగ్‌ లో తాను రూ.11 లక్షలు పెట్టుబడి పెట్టానని, కానీ తనకు ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తక్కువ పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామని చెప్పి డబ్బులు ఇవ్వడం లేదని షమై పంచాక్షర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సూత్రధారి దీపాంకర్ బర్మన్..

అస్సాం రాష్ట్రానికి చెందిన దీపాంకర్ బర్మన్ డీబీ స్టాక్ బ్రోకింగ్ పేరుతో 2018లో పెట్టుబడులు ప్రారంభించారు. అనతికాలంలోనే స్టాక్ బ్రోకింగ్, అధిక వడ్డీ రాబడితో పథకాలను అందించడం ద్వారా వేలాది మంది క్లయింట్ లను ఆకర్షించింది. 120 శాతం వడ్డీతో వార్షిక పథకం, 54 శాతంతో అర్ధ వార్షిక పథకం, 7 శాతం వడ్డీతో నెలవారీ పథకాలు ప్రారంభించారు. వీటికి ఆకర్షితులైన వేలాదిమంది జనాలు పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడిదారులకు మొదట్లో కొంతకాలం పాటు సాఫీగానే డబ్బులు చెల్లించిన ఈ సంస్థ తదనంతరం డబ్బులు చెల్లించడం మానేసింది. ఈ ఏడాది జులై నెల నుంచి తమకు చెల్లింపులు ఆగిపోయాయని పెట్టుబడిదారులు తెలిపారు.

కేపీహెచ్ బీలో కార్యాలయం..

తెలంగాణలో కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు వేదికగా డీబీ స్టాక్ బ్రోకింగ్ పెట్టుబడులు స్వీకరించింది. ఈ శాఖలో వేలాదిమంది జనాలు పెట్టుబడులు పెట్టారు. ఈ స్కామ్ లో జగదీష్ అనే వ్యక్తిపై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కేపీహెచ్ బీలోని ఈ సంస్థ కార్యాలయం మూసివేసి ఉండడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పరారీలో ప్రధాన నిందితుడు డీబీ

వేలాది మంది జనాలకు భారీ ఎత్తున కుచ్చుటోపీ పెట్టిన దీపాంకర్ బర్మన్ ( డీబీ) పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. సైబరాబాద్ ఈ ఓడబ్ల్యూ పోలీసులు దీపాంకర్ బర్మన్ తో పాటు కంపెనీలోని ప్రధాన పోస్టుల్లో ఉన్న పలువురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story