అలా చేయాలంటే.. మేం భారత్‌ను వీడాల్సి వస్తుంది.. వాట్సప్ సంచలన నిర్ణయం

by Disha Web Desk 5 |
అలా చేయాలంటే.. మేం భారత్‌ను వీడాల్సి వస్తుంది.. వాట్సప్ సంచలన నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ విధానాన్ని తొలగించాల్సి వస్తే.. మేము భారత్ ను వీడాల్సి వస్తుందని ఢిల్లీ హైకోర్టుకు కోర్టుకు వాట్సాప్ సంస్థ తేల్చి చెప్పింది. 2021 లో వచ్చిన కొత్త ఐటీ నిబంధనల్లోని సెక్షన్ 4(2) చట్టబద్దం చేయడాన్ని సవాల్ చేస్తూ వాట్సప్, ఫేస్బుక్ సంస్థలు దాఖలు చేసిన పిటీషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. విచారణలో భాగంగా సంస్థల తరపు న్యాయవాది తమ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ లో సందేశాల భద్రత కోసం ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ విధానాన్ని అవలంభిస్తున్నామని, ఈ విధానం వల్ల గోప్యత హామీ ఉండటంతో కొట్లాది మంది భారతీయులు వినియోగిస్తున్నారని వాదించారు.

అంతేగాక ఈ సెక్షన్ 4(2) వల్ల మేం బలవంతంగా ఎన్‌క్రిప్షన్ ను బ్రేక్ చేయాల్సి ఉంటుందని, అలా చేయాలని మీరు చెబితే మేం మా సేవలను భారత్ లో నిలిపివేయాల్సి వస్తుందని కోర్టుకు వివరించారు. ఈ సెక్షన్ వ్యక్తుల గోప్యతకు వ్యతిరేకం అని, రాజ్యాంగ విరుద్దం అని ఆరోపించిన న్యాయవాది.. సామాజిక మాధ్యమ సంస్థలతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే ప్రవేశపెట్టారని, దీనివల్ల కోట్లాది మంది సంభాషణలకు కొన్నేళ్ల పాటు భద్రపరచాల్సి ఉంటుందని, ఇలాంటి నిబందనలు ప్రపంచంలో ఎక్కడా లేదని వాదించారు.

ఈ వాదనలు విన్న హైకోర్టు విచారణను ఆగస్టు 14 వ తేదికి వాయిదా వేసింది. కాగా 2021లో తెచ్చిన నూతన ఐటీ చట్టం అమలులోకి రాగా.. ఈ నిబందనలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్, ట్విట్టర్ వంటి సంస్థలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. అయితే వీటిని సామాజిక మాధ్యమ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. పలు కోర్టుల్లో పిటీషన్లు దాఖలు చేశాయి. ఈ నేపధ్యంలోనే వాట్సప్, ఫేస్ బుక్ సంస్థలు ఈ నిబందనల్లోని 4(2) సెక్షన్ వ్యక్తుల భావ ప్రకటన స్వేచ్చకు, వినియోగదారుల హక్కులకు భంగం కలిగిస్తుందని, సందేశం పంపే వ్యక్తి వివరాలు బహిర్గతం చేసే ఈ నిబందనలకు సవరించాలని కోర్టును ఆశ్రయించాయి.



Next Story

Most Viewed