Tmc mp: మమతా బెనర్జీకి షాక్.. కోల్‌కతా ఘటనను నిరసిస్తూ టీఎంసీ ఎంపీ రిజైన్ !

by vinod kumar |
Tmc mp: మమతా బెనర్జీకి షాక్.. కోల్‌కతా ఘటనను నిరసిస్తూ టీఎంసీ ఎంపీ రిజైన్ !
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి షాక్ తగిలింది. కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై లైంగిక దాడి హత్య ఘటనకు నిరసనగా తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) రాజ్యసభ ఎంపీ జవహర్ సిర్కార్ పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే తన రిజైన్ లెటర్‌ను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్‌కు అందించనున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం మమతా బెనర్జీకి లేఖ రాశారు. ‘ఆర్జీకర్ ఆస్పత్రిలో జరిగిన ఘటన తర్వాత నెల రోజులు మౌనంగా ఉన్నాను. నిరసన చేస్తున్న జూనియర్ డాక్టర్ల విషయంలో మీ పాత పద్దతిలోనే జోక్యం చేసుకుంటారని ఆశించాను. కానీ ఇది జరగలేదు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆలస్యం అవుతున్నాయి’ అని తెలిపారు.

తప్పు చేసిన వారిని ఘటన జరిగిన వెంటనే శిక్షించి ఉంటే, చాలా కాలం క్రితమే రాష్ట్రంలో సాధారణ స్థితి ఏర్పడి ఉండేదని పేర్కొన్నారు. ఉద్రిక్తతల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని సూచించారు. ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పోయిందని చెప్పారు. రాజీనామా తర్వాత రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగుతానని స్పష్టం చేశారు. కాగా, ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ పై లైంగిక దాడి, హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ నేరానికి పాల్పడిన సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన అనంతరం దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీకి చెందిన జవహార్ రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

Next Story