సుప్రీంకోర్టులో సరిహద్దు వివాదం.. శ్రుతిమించొద్దని అంగీకరించిన కర్ణాటక, మహారాష్ట్ర

by samatah |
సుప్రీంకోర్టులో సరిహద్దు వివాదం.. శ్రుతిమించొద్దని అంగీకరించిన కర్ణాటక, మహారాష్ట్ర
X

న్యూఢిల్లీ: దాదాపు 65 సంవత్సరాలకు పైగా నలుగుతున్న సరిహద్దు వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ పూర్తయేంతవరకు వేచి ఉండాలని మహారాష్ట్ర, కర్ణాటకలు అంగీకరించాయి. బుధవారం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయిన హోంమంత్రి అమిత్ షా ఈ విషయంపై వారిని ఒప్పించినట్లు ప్రకటించారు. 1957 నుంచి రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సరిహద్దు ఘర్షణలపై కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు బసవరాజ్ బొమ్మై, ఏక్‌నాథ్ షిండేతో షా ఢిల్లీలో సమావేశమయ్యారు. బెల్గాంతో సహా మరాఠీ మాట్లాడే ప్రాంతాలను కర్ణాటకలో కలపడంపై మహారాష్ట్ర తొలినుంచి అసమ్మతి వ్యక్తం చేస్తోంది. బాంబే ప్రెసిడెన్సీ నుంచి రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు దాదాపు 814 మరాఠీ మాట్లాడే గ్రామాలను కర్ణాటకలో కలిపేశారని మహారాష్ట్ర వాదిస్తోంది. అయితే ఈ అంశం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నందున తుది తీర్పు వచ్చేంతవరకు వేచి ఉండటానికి షా సమక్షంలో ఇరు రాష్ట్రాల సీఎంలు అంగీకరించినట్లు హోంశాఖ వర్గాలు తెలిపాయి. గత కొన్నివారాలుగా మహారాష్ట్ర నుంచి వచ్చే ట్రక్కులపై కర్ణాటకలో దాడులు జరుగుతున్న నేపథ్యంలో హింసాత్మక ఘటనలు పెరిగిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story