నిజంగానే ఇది వింత కలిగించే విషయం...

by S Gopi |
నిజంగానే ఇది వింత కలిగించే విషయం...
X

న్యూఢిల్లీ: ఈశాన్య సరిహద్దుల నుంచి భారత్ రక్షణకు ప్రమాదం క్రమంగా పెరుగుతోందని మాజీ ఆర్మీ జనరల్ ఎమ్ఎమ్ నవరణే చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా సైనికులతో ఇటీవల జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఆయన గురువారం ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. ఈ సరిహద్దు ప్రమాదాన్ని పరిస్థితులకు అనుగుణంగా విశ్లేషించుకుంటూ వస్తున్న భారతీయ సైన్యం దాని నివారణ చర్యలను కూడా చేపడుతోందని పేర్కొన్నారు. ఇరుగు పొరుగు దేశాలు కవ్విస్తే దానికి ప్రతి సమాధానం చెబుతామని భారత్ ప్రపంచానికి చేసి చూపిందని కితాబిచ్చారు. ముళ్లు చుట్టిన కర్రలు, ముళ్ల తీగెలతో దాడి చేయడం ద్వారా చరిత్ర పూర్వయుగం స్థాయికి చైనా ఘర్షణలను తీసుకుపోతోందని ఆరోపించారు. అలాంటి మొరటు పద్ధతులకు తావివ్వకుండా భారత్ సైన్యం కాల్పులకు సిద్ధపడాలని సూచించారు. ప్రత్యర్థి బలగంతో తోపులాటకు దిగడం వంటి పద్దతులకు చైనా సైన్యం పాల్పడుతోందని కానీ, పొరుగుదేశం కవ్విస్తే తానేం చేయగలనో భారత్ ఇప్పటికే ప్రపంచానికి ప్రదర్శించిందని మాజీ ఆర్మీ చీఫ్ పేర్కొన్నారు. ఆధునిక సైన్యం ఆయుధాలతో తలపడుతుంది తప్పిస్తే పిడికిళ్లతో ముష్టిఘాతాలు వంటి మెతక పద్ధతులకు పాల్పడదని, పిడికిళ్లతో తలపడటానికి మనం రౌడీలం కాదని, స్ట్రీట్ ఫైటర్లం అసలే కాదని స్పష్టం చేశారు. మనం ప్రొఫెషనల్ సైనికులమని, 21వ శతాబ్ది సైన్యంగా చైనా పీఎల్ఏ తనను తాను ప్రదర్శించుకోవడానికి బదులుగా మూక దాడులకు, వీధి పోరాటాల స్థాయికి తనను తాను కుదించుకుంటోందని ఆయన ఎద్దేవా చేశారు. సాంకేతికంగా తాము ఉన్నతులమని చెప్పుకుంటూనే ముళ్లతీగలు చుట్టిన కర్రలతో వారు దాడికి వస్తున్నారని, ఇది నిజంగానే వింత కలిగించే విషయమని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story